
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో ముష్కరుల ఇండ్ల పేల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది టెర్రరిస్టుల ఇండ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. వచ్చే కొద్ది రోజుల్లోనూ ఇండ్ల పేల్చివేతలు కొనసాగనున్నాయి.
లష్కరే తాయిబా టెర్రరిస్టులు ఆదిల్ హుస్సేన్ థోకర్, జకీర్ అహ్మద్ గనీ, ఆమిర్ అహ్మద్ దార్, ఆసిఫ్ షేక్, షహీద్ అహ్మద్ కుత్తె, అషన్ ఉల్ హక్ ఆమిర్, జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు ఆమిర్ నజీర్ వనీ, జమీల్ అహ్మద్ షేర్ గోజ్రీ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన అద్నన్ సఫీ దార్, ఫరూఖ్ అహ్మద్ తేడ్వా ఇండ్లను బలగాలు నేలమట్టం చేశాయి.
కాగా.. అషన్ ఉల్ హక్ 2018లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని, ఇటీవలే కాశ్మీర్ లోయలో చొరబడ్డాడని అధికారులు తెలిపారు. లష్కర్ టెర్రరిస్టులు షహీద్ అహ్మద్ కుత్తె, జకీర్ అహ్మద్ గనీ కూడా దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని, జకీర్ పై నిఘా కొనసాగుతున్నదని వెల్లడించారు. ఫరూఖ్ అహ్మద్ తేడ్వా పాకిస్తాన్ నుంచి ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్నాడని చెప్పారు. పహల్గాం టెర్రర్ అటాక్ లో థోకర్ పాల్గొన్నాడని పేర్కొన్నారు.
సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు: ముఫ్తీ
పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఉగ్రవాదులపై తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ అన్నారు. అయితే, అమాయకులను దేశ ప్రజల నుంచి వేరుచేయవద్దని ‘ఎక్స్’ వేదికగా ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే విషయంలో భారత ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి.
ఆ క్రమంలో అమాయకులను, ఉగ్రవాదులను గుర్తించాలి. సాధారణ ప్రజలను కూడా టెర్రరిస్టులతో కలిపేయరాదు. అటాక్ నేపథ్యంలో కొన్నివేల మందిని అరెస్టు చేశారని, టెర్రరిస్టుల ఇండ్లను కూడా కూల్చివేశారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సాధారణ ప్రజలు బాధితులు కాకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా” అని ముఫ్తీ పేర్కొన్నారు.