కాశ్మీర్‌‌‌‌ బంద్..నిరసన ర్యాలీలు.. హిందూస్థాన్ జిందాబాద్​ నినాదాలు

కాశ్మీర్‌‌‌‌ బంద్..నిరసన ర్యాలీలు.. హిందూస్థాన్ జిందాబాద్​ నినాదాలు
  • సోషల్ మీడియాలో పహల్గామ్‌‌‌‌ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ ట్రెండింగ్

పహల్గామ్: టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్‌‌‌‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. టెర్రరిజాన్ని సహించం.. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు. 

టెర్రరిస్ట్‌‌‌‌ల అటాక్‌‌‌‌కు నిరసనగా కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తంగా బుధవారం బంద్‌‌‌‌ పాటించారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ షట్‌‌‌‌డౌన్‌‌‌‌ పాటించాలంటూ మసీదుల్లోని మైకుల్లోనూ అనౌన్స్‌‌‌‌ చేస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లమీదికి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ఇలా పూర్తిస్థాయిలో కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌ పాటించడం ఐదేండ్ల తర్వాత ఇదే తొలిసారి.

మానవత్వానికి మాయని మచ్చ.. 

టూరిస్ట్‌‌‌‌ హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌ అయిన కాశ్మీర్‌‌‌‌..‌‌‌‌ టెర్రరిస్టుల దాడితో ఒక్కసారిగా మూగవోయింది. పహల్గామ్‌‌‌‌లో దుకాణాలు, హోటల్స్, మార్కెట్లన్నీ మూతపడ్డాయి. ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. ‘హిందూస్థాన్‌‌‌‌ జిందాబాద్, మేం భారతీయులం’ అంటూ నినాదాలు మిన్నంటాయి. పహల్గామ్‌‌‌‌లో చిక్కుకుపోయిన టూరిస్టులకు అండగా ఉంటామని నిరసనకారులు తెలిపారు. వాళ్లకు 15 రోజులపాటు ఫ్రీగా వసతి కల్పిస్తామని కొందరు హోటల్స్ నిర్వాహకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘ఇది టూరిజానికి మాత్రమే కాదు, మానవత్వానికి మాయని మచ్చ, సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన” అని పేర్కొన్నారు. 

వెకేషన్‌‌‌‌కు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చేసిన తప్పేంటి.. ఇప్పుడు వాళ్ల కుటుంబాల పరిస్థితేంటి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు తామంతా ఆర్మీతో కలిసి పోరాడుతామంటూ నినదించారు. దాడి ఘటనను ఖండిస్తూ ఢిల్లీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలంటూ తమ చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ర్యాలీ తీశారు. కాగా, పహల్గామ్‌‌‌‌ దాడిపై కోట్లాదిమంది ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పహల్గామ్‌‌‌‌ అటాక్‌‌‌‌ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ ట్రెండింగ్​గా మారింది.