కశ్మీర్​కి కంపెనీలు క్యూ..

జమ్మూ కశ్మీర్​పై నెలకొన్న అనుమానాలు తొలగిపోతున్నాయి.

రీసెంట్​గా కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ ఏరియా అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి నాన్​ లోకల్​ బిజినెస్​ మ్యాగ్నెట్లు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ల్యాండ్​ ఇస్తే చాలు కంపెనీలు ప్రారంభించేందుకు సై అంటున్నారు. ఆఫీసర్లు కూడా దీనికి తగ్గట్లే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 57,000 ఎకరాల భూమిని వారికోసం గుర్తించారు. ఫ్యూచర్​లో ‘ల్యాండ్​ బ్యాంక్​’ ఏర్పాటు చేయనున్నారు.

జమ్మూ కాశ్మీర్​ ప్రత్యేక హోదాను రద్దు చేయటం వల్ల లాభమే తప్ప నష్టం లేదన్న కేంద్రం వాదన క్రమంగా నిజమవుతోంది. ఆ స్టేట్​ డెవలప్​మెంట్​కి అడ్డుగా ఉందంటూ స్పెషల్​ స్టేటస్​ను మోడీ సర్కారు తొలగించటం వంద శాతం కరెక్ట్​ అని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఇన్నాళ్లూ ఆ ప్రాంతానికి బయటి నుంచి ఇన్వెస్ట్​మెంట్లు వచ్చే దారులు మూసుకుపోవటానికి కారణమైన రాజ్యాంగంలోని ఆర్టికల్​–370, ఆర్టికల్​–35ఏ ఇప్పుడు అక్కడ లేకపోవటంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్​లోని ఆ రెండు ప్రొవిజన్లను ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు 5న ఎత్తేయటమే కాకుండా ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీలు)గా విభజించింది. ఈ నిర్ణయం అక్టోబర్​ 31 నుంచి అమల్లోకి వచ్చింది. అక్కడ వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఔట్​సైడ్​ పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు.

ముందుగా ‘ల్యాండ్​ బ్యాంక్​’

ఔట్​సైడ్​ ఇన్వెస్టర్లకు తలుపులు తెరిచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ‘ల్యాండ్ బ్యాంక్​’ ఏర్పాటు చేశాకే పరిశ్రమలకు భూములు కేటాయించాలనుకుంటోంది. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు పెట్టుబడిదారులు జమ్మూ కాశ్మీర్​పై ప్రత్యేక ఆసక్తి చూపుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. ఒక్కసారి బయటి సంస్థలు ఇక్కడ ఆపరేషన్స్​ ప్రారంభిస్తే ఇతర ఇన్వెస్టర్లు కూడా ధైర్యంగా ముందుకొస్తారని ఆశిస్తోంది.    ​

జమ్మూ కాశ్మీర్​లో పరిశ్రమల స్థాపనకు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తి చూపుతున్నందున… జనంలోనూ ఆశలు పెరుగుతున్నాయి. 2014లోనే కేంద్రంలోని బీజేపీ లీడర్​షిప్​లోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దానిపై కసరత్తు జరిపినా పూర్తి బలం లేకపోవడంతో రద్దుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది లోక్​సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని మెజారిటీతో గెలిచాక అంతా అనుకున్నట్లే చేసింది. ఆ ప్రాంతాల్లోని మెయిన్​స్ట్రీమ్​ పొలిటికల్​ పార్టీలు ప్రజల్లో భయాందోళనలను పెంచడానికి ప్రయత్నించినా కుదరలేదు.

ల్యాండ్​ కోసం 39 అప్లికేషన్లు

కంపెనీలు స్థాపించి బిజినెస్​ ప్రారంభించడానికి భూములు కావాలంటూ 39 మంది ఆసక్తి చూపారు. స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ​(సిడ్కో)కి అప్లికేషన్లు పెట్టుకున్నారు. సిల్క్​ టెక్స్​టైల్స్, కార్పెట్​  మేకింగ్​, ఉన్ని టెక్స్​టైల్​, అటవీ ఉత్పత్తులు, సిమెంట్, ఆగ్రో బేస్​డ్​ ఇండస్ట్రీలే కాకుండా… యాపిల్​, కోల్డ్​ స్టోరేజీ, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వు, టూరిజం, హోటల్స్​ తదితర పరిశ్రమల నిర్మాణానికి నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. తమ పెట్టుబడులకు సంబంధించిన డిటెయిల్డ్​ ప్రాజెక్టు ప్రపోజల్స్​ (డీపీపీ)ని అందజేశారు. అయితే, ఇవన్నీ ఇప్పుడు తొలి దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకూ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.  వెస్సు ప్రాంతమైన  అనంత్​నాగ్​ జిల్లాలోనూ కొంత భూమిని దీనికోసం గుర్తిస్తున్నామని, ఈ ప్రాసెస్​ కొన్నాళ్లుగా సాగుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. తమ తమ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను అందజేయాలంటూ జమ్మూ కాశ్మీర్​లోని అన్ని జిల్లాల కమిషనర్లకు గవర్నమెంట్​ నుంచి ఆదేశాలు​ వచ్చాయని అంటున్నారు. ఈ రెండు రీజియన్లలోనూ చాలినంత భూమి ఉందని సిడ్కో ఎండీ రవీందర్​ చెప్పారు.

57 వేల ఎకరాలు రెడీ

మన దగ్గర భూములను ఎకరాల్లో లెక్కిస్తారు. కానీ.. జమ్మూ కాశ్మీర్​లో కనాల్స్​లో కొలుస్తారు. ఒక కనాల్​ ఒక ఎకరంలో ఎనిమిదో వంతు (600 గజాలు)కు సమానం. ఆ ప్రకారంగా యూటీలో ఇప్పటివరకు 4.56 లక్షల కనాల్స్ (57 వేల ఎకరాల) భూమి​ని పారిశ్రామిక అవసరాలకు గుర్తించారు. ఇందులో 1,250 ఎకరాలను జమ్మూలోని కథువా, సాంబా జిల్లాల్లో, మరో 625 ఎకరాల నుంచి 875 ఎకరాల వరకు కాశ్మీర్​లోని గందేర్​బల్​, కుప్వారాతోపాటు ఇతర జిల్లాల్లో ఇవ్వదలిచారు. మొత్తంగా కాశ్మీర్​ లోయలో 15 వేల ఎకరాలను, జమ్మూ రీజియన్​లో 42,500 ఎకరాల భూమిని  ఇండస్ట్రీలకు కేటాయించడానికి అధికారులు గుర్తించారు.

భయాలు పోగొడుతున్నం

జమ్మూ కాశ్మీర్​లోని ముస్లింల మెజారిటీని తగ్గించేందుకే బీజేపీ ఈ పని చేసిందంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు గుప్పించాయి. ఈ భయాలను పోగొట్టడానికి అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. కేంద్రం జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలేవీ తీసుకోదని బీజేపీ నేషనల్​ జనరల్​ సెక్రెటరీ రామ్​మాధవ్ హామీ ఇచ్చారు. లోకల్​ ఐడెంటిటీ, కల్చర్​, జాబ్స్​, ఎడ్యుకేషన్​.. ఇలా అన్ని అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి