సిన్మావాళ్లను కాశ్మీర్ పిలుస్తోంది!
కాశ్మీర్ పేరు వినగానే టూరిజం గుర్తుకువస్తుంది.కాశ్మీర్ అందాలు టూరిస్టులను కళ్లు తిప్పుకోనివ్వవు. అందానికి అందమైన కాశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లు కూడా ఎక్కువే. అయితే కొద్దికాలంగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. సినిమా షూటింగ్‌లు తగ్గిపోయాయి. దీంతో సినిమా ఇండస్ట్రీ వాళ్లను మళ్లీ ఆహ్వానించారు కాశ్మీర్ గవర్నర్ సలహాదారుడు ఫరూఖ్ ఖాన్. ఎంచక్కా షూటింగ్‌లు చేసుకోండన్నారు.
కశ్మీర్ అంటేనే పచ్చదనానికి మరో పేరు. ఎటు చూసినా ప్రకృతికి చీరకట్టినట్లు ఉంటుంది. కాశ్మీర్ అందాలకు టూరిస్టులే కాదు సినిమా వాళ్లు కూడా ఫిదా అవుతుంటారు. దీంతో షూటింగ్‌ల కోసం కాశ్మీర్ కు వస్తుంటారు. కాశ్మీర్ లోయలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇదంతా గతం. జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టు యాక్టివిటీస్ పెరగడంతో సినిమా వాళ్లు అక్కడకు వెళ్లడం మానేశారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రకరకాల భయాలు, అపోహలతో సినిమా వాళ్లు షూటింగ్‌ల కోసం రావడం తగ్గిపోయింది. ఎక్కడా సినిమా వాళ్ల సందడే లేదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఎల్జీ ముర్ము కు సలహాదారుడిగా ఉన్న ఫరూఖ్ ఖాన్ రంగంలోకి దిగారు. లేటెస్ట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎప్పటిలాగానే కాశ్మీర్ కు వచ్చి షూటింగ్ లు చేసుకోవాల్సిందిగా సినిమా వాళ్లను కోరారు.
టూరిజమే ప్రధాన రాబడి
కాశ్మీర్ కు ప్రధాన రాబడి టూరిజం నుంచే వస్తోంది. ఒకప్పుడు టూరిస్టులతో, షూటింగ్ లకు వచ్చే సినిమా వాళ్లతో కాశ్మీర్ ప్రాంతం అంతా సందడిగా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు తరువాత టూరిస్టుల సంఖ్య బాగా తగ్గింది. కొంతకాలం పాటు కాశ్మీర్ అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సినిమా వాళ్లు రావడం మానేశారు. దీంతో రాబడి లేకపోవడంతో కాశ్మీర్ ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితులు వచ్చాయి. కాశ్మీర్ ను టెర్రరిస్టు హబ్ గా కాకుండా భూమ్మీద స్వర్గంగా చూడాలంటున్నారు.
గుల్మార్గ్ అందాలు
హిందీ సినిమాలు చూసేవాళ్లకు గుల్మార్గ్ అందాలు కొత్త కావు. ‘బాబీ’, ‘హైదర్’, ‘జబ్ తక్ హై జాన్’. ‘ఆప్ కీ కసమ్’ వంటి అనేక సినిమాల్లో గుల్ మార్గ్ అందాలను అద్భుతంగా చూపించారు.
లడఖ్‌లోనూ..
సహజంగా సినిమా షూటింగ్ లన్నీ కాశ్మీర్ లోనే ఎక్కువగా జరుగుతాయి. కాశ్మీర్ లోయలోనే కాదు, లడఖ్ లోనూ అందమైన లొకేషన్లు ఉన్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా కొంతభాగం షూటింగ్ లడఖ్ లోనే జరిగింది.
పాటలంటే కాశ్మీర్ వెళ్లాల్సిందే
బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా సాంగ్స్ పిక్చరైజేషన్ ను కాశ్మీర్‌లోనే షూట్ చేసేవారు. కొన్ని సినిమాలైతే పూర్తిగా కాశ్మీర్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ‘నోట్ బుక్’ సినిమాను. ఈ ఏడాది రిలీజైన ‘నోట్ బుక్’ ను టోటల్ గా కాశ్మీర్ లోయలోనే షూట్ చేశారు. కిందటేడాది రిలీజైన్ ‘రాజి’ సినిమా షూటింగ్ కూడా కాశ్మీర్ లోయలోనే జరిగింది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లోఈ సినిమా తీశారు. ఇందులో అలియా భట్….ఒక కాశ్మీరీ అమ్మాయిగా నటించింది. 2016లో విడుదలైన ‘ఫితూర్’ సినిమా ను కూడా కాశ్మీర్ లోని డాల్ సరస్సు చుట్టుపక్కల షూట్ చేశారు. అలాగే పహల్ గావ్ అందాలను సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా చూపించిన సినిమా ‘హై వే’. పహల్ గావ్ లోని ట్రెక్కింగ్ స్పాట్లలో ఈ సినిమా మెజారిటీ పార్ట్ ను షూట్ చేశారు.
డాల్ సరస్సు బ్యాక్ డ్రాప్లో పిక్చరైజేషన్
కాశ్మీర్ లోని రెండో అతి పెద్ద సరస్సు…డాల్ లేక్. 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు శ్రీనగర్ లోని మేజర్ టూరిస్టు స్పాట్ లలో ఒకటి. కాశ్మీర్ కు వచ్చిన టూరిస్టులు డాల్ సరస్సులో పడవ ఇళ్లల్లో ప్రయాణం చేసి గొప్ప థ్రిల్ ఫీలవుతుంటారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అందమైన డాల్ లేక్ బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమా సాంగ్స్ ను పిక్చరైజ్ చేశారు.
గుళ్లు, గోపురాలు
కాశ్మీర్ లో సరస్సులే కాదు అనేక చారిత్రక గుళ్లు, గోపురాలు కూడా ఉన్నాయి. వీటిలో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం ముఖ్యమైనది. వేల ఏళ్ల కిందట ఈ గుడిని నిర్మించారని చెబుతారు. భైరవ్ అనే ఓ బ్రహ్మ రాక్షసుడిని వైష్ణోదేవి హతమార్చిందని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో ఆ రాక్షసుడి తల తెగి అక్కడి లోయలో పడిందని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు వైష్ణో దేవిని పూజించాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు సూచించాడట. దీంతో వైష్ణో దేవిని అర్జునుడు పూజించి యుద్ధానికి బయల్దేరాడని చరిత్రకారులు అంటారు.
జమ్మూలో రఘునాథ మందిరం
జమ్మూ ప్రాంతంలో కూడా అనేక చూడదగ్గ ప్రదేశాలున్నాయి. వీటిలో ముఖ్యమైంది రఘునాథ్ మందిరం. జమ్మూ నగరానికి మధ్యలో ఉంటుంది. 1822లో మందిర నిర్మాణం ప్రారంభమైతే 1860కు కానీ పూర్తి కాలేదు. విశాలమైన ముఖద్వారం, లోపల పాలరాతి నేల చూడగానే ఆకట్టుకుంటుంది రఘునాథ ఆలయం. బయటి ద్వారంపై రంగురంగుల దేవతల బొమ్మలు …గుడి అందాలకు ఎవరైనా సరే ఫిదా కావలసిందే. వాస్తవానికి ఇది ఒక మందిరం కాదు, మందిర సముదాయం. ఈ ప్రాంగణంలో మొత్తం ఏడు మందిరాలున్నాయి.
టాలీవుడ్ ఫిదా
కాశ్మీర్ అందాలకు టాలీవుడ్ కూడా ఫిదా అయింది. అనేక తెలుగు సినిమాల పాటలను ఇక్కడ షూట్ చేశారు. 90ల వరకు సాంగ్స్ తీయడానికి విదేశాలకు వెళ్లే అలవాటు తెలుగు దర్శకులకు పెద్దగా ఉండేది కాదు. అందమైన లొకేషన్ లో పాట తీయాలంటే ప్రొడ్యూసర్లకు వెంటనే గుర్తుకువచ్చేది కాశ్మీరే. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాలు దాదాపుగా కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్నవే. వీటిలో ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ’, ‘ చీకటి వెలుగులు’, ‘శ్రీవారి ముచ్చట్లు’ ‘రాక్షసుడు’, ‘స్వర్ణ కమలం’, ‘పసివాడి ప్రాణం’ వంటి అనేక సినిమాలు ఉన్నాయి. ‘పసివాడి ప్రాణం’ సినిమాలోని ‘కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ….’ అనే పాటను కాశ్మీర్ అందాల బ్యాక్ డ్రాప్ లో తీశారు. 1995 తరువాత కాశ్మీర్ లో టాలీవుడ్ సినిమాల షూటింగ్ కొంతమేర తగ్గింది. అయితే ఈమధ్య మళ్లీ టాలీవుడ్ డైరక్టర్స్ కాశ్మీర్ బాట పడుతున్నారు. లేటెస్ట్ గా ‘వెంకీ మామా’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను కూడా కాశ్మీర్ లో షూట్ చేశారు.
బాలీవుడ్‌కు ఫేవరేట్
‘యాహూ….చాహె కోయి ముఝే జంగ్లీ కహే…’ అంటూ జంగ్లీ సినిమాలో (1961 ) షమ్మీ కపూర్ వెరైటీగా డ్యాన్స్ చేసింది కాశ్మీర్ లోనే. కాశ్మీర్ తో సినిమా ఇండస్ట్రీ రొమాన్స్ ఇవాళ్టిది కాదు. చాలా ఏళ్లుగా ఈ రొమాన్స్ కొనసాగుతోంది. అలనాటి షర్మిలా ఠాగూర్ నుంచి ఈతరం హీరో షారూఖ్ ఖాన్ వరకు అందరూ …..కాశ్మీర్ పై మనసు పారేసుకున్న వాళ్లే. ఇక్కడ రొమాంటిక్ పాటలు పాడినవాళ్లే. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో ‘కాశ్మీర్ కీ కలి’ పేరుతో ఏకంగా ఒక సినిమానే వచ్చింది. డాల్ సరస్సులో ఈ సినిమాలోని పాటలను షూట్ చేశారు. చుట్టూ కొండలు…ఆ కొండల మధ్య గలగలాపారే సెలయేరు… ఈ అందమైన లొకేషన్ లో ‘సిల్ సిలా’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ వంటి బోలెడన్ని బాలీవుడ్ సినిమాల షూటింగ్ లు జరిగాయి.
అవంతీపూర్ ఆలయం
జమ్మూలోని ప్రముఖ ఆలయాల్లో అవంతీపూర్ ఒకటి.అవంతీరామన్ ఈ ప్రాంతాన్ని పాలించిన సమయంలో ఈ గుడి కట్టినట్టు చరిత్రకారులు చెబుతారు. మౌలికంగా ఇది విష్ణువు ఆలయం. 18వ శతాబ్దంలో ఈ ఆలయం నుంచి అనేక విగ్రహాలను బ్రిటిష్ వాళ్లు ఇంగ్లాండ్ లోని మ్యూజియమ్ లకు తరలించినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ గుడి శిధిలావస్థలో ఉంది.