జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకంగా నిలబడ్డ ఆర్టికల్–370 రద్దు కాగానే, ఆ ప్రాంతం అందరికీ జున్ను ముక్కలా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మొదలుకొని సినీ రంగం వరకు, ఆపిల్ తోటల నుంచి అధికార మార్పిడి వరకు ఇకమీదట కాశ్మీర్ ఉమ్మడి సొత్తుగా మారుతుందని భావిస్తున్నారు. మోడీ సర్కారు ఉద్దేశం అది కాదు. ఇన్నాళ్లూ టెర్రరిజానికి అడ్రస్‌లా మారిన ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలచాలన్నదే కాన్సెప్ట్. ప్రధాని మోడీ, పార్టీ సుప్రీం అమిత్ షా, లోకల్ బీజేపీ నాయకులు ఇదే మాట చెబుతున్నారు. అయితే, డొమినైల్ బేస్డ్ పాలసీని పాటించకపోతే… కాశ్మీర్ కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని సోసల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.
దేశానికి బోర్డర్లో ఉన్న జమ్మూకాశ్మీర్ దశాదిశను మార్చటానికి మోడీ సర్కారు ‘ఆర్టికల్–370’తోపాటు ‘ఆర్టికల్–35ఏ’ని రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్–35ఏ క్యాన్సిల్ కావటంతో అక్కడికి ఎవరైనా వెళ్లిపోయి, ఎన్ని ఎకరాల భూమినైనా కొనుకోవచ్చని అనుకుంటున్నారు. ఆ మాట నిజమే అయినా భవిష్యత్‌లో అలాంటి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో సీలింగ్(లిమిట్) పెట్టాలని లోకల్ బీజేపీ లీడర్లు తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్థానికుల హక్కులను (ముఖ్యంగా భూములు, ఉద్యోగాలకు సంబంధించినవి) కాపాడటానికి డొమిసైల్ బేస్డ్ పాలసీని (నివాస ప్రాతిపదికన రూపొందించే విధానాన్ని) అమలుచేయాలని బీజేపీ భావిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ సూచనప్రాయంగా చెప్పారు. దీన్నిబట్టి రానున్న రోజుల్లో పరాయి రాష్ట్రాల ప్రజలు ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు (జమ్మూకాశ్మీర్, లఢఖ్లకు) వెళ్లి ఆస్తులు కూడబెట్టుకోవటం అనుకున్నంత ఈజీ కాదని అర్థమవుతోంది.
‘హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఔట్ సైడ్ స్టేట్ల వాళ్లు తమకు ఇష్టమొచ్చినంత భూమిని కొనే అవకాశం లేదు. ఇదే మాదిరిగా జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాట్లు చేయాలని కేంద్రంలోని మా సర్కార్‌కి సూచిస్తున్నాం. కాశ్మీర్‌లోని కాశ్మీరీల, వాల్మీకీల, గుజ్రాల, బకర్వాలాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో లోకల్ పబ్లిక్ని అనవసరంగా భయాందోళనలకు గురిచేసే ప్రచారాన్ని ఇప్పటికైనా కట్టడి చేయాలి’ అని నిర్మల్ సింగ్.. మోడీ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.
భూముల ఆక్రమణలకు ఫుల్స్టాప్ పెట్టండి
కొందరు అనుకుంటున్నట్లుగా జమ్మూకాశ్మీర్ ఇక ‘ఓపెన్ ఫర్ ఆల్’ అనే అభిప్రాయం కరెక్ట్ కాదని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర గుప్తా తేల్చిచెప్పారు. గతంలో అక్కడ చాలా భూములను పలుకుబడి ఉన్నోళ్లు ఎంతో మంది ఆక్రమించేసుకున్నారని, ముందు ముందు ఇలాంటి ఆగడాలు సాగవని ఆయన హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్ డెవలప్మెంట్కి సంబంధించి కేంద్రం ఫ్యూచర్లో ఏ నిర్ణయం తీసుకున్నా లోకల్స్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వాలని గుప్తా అభిప్రాయపడ్డారు.
‘ఈ ఏరియాలో అవకాశాల కొరత ఉంది. ఇప్పటికీ 5 నుంచి 6 శాతం మంది మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలి. తద్వారా ఆపర్చునిటీస్ కల్పించాలి. ప్రధాని మోడీ కూడా ఈమధ్య ఇదే అన్నారు. దీనికోసం కేంద్రం అక్టోబర్‌లో జమ్మూకాశ్మీర్‌లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తోంది. ఈ సదస్సు అనంతరం స్థానికంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెద్దఎత్తున జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని నరేంద్ర గుప్తా వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇప్పటికే..
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు మెజారిటీ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితులు ఇప్పటికే ఉన్నాయి. బయటి రాష్ట్రాల వాళ్లు హిమాచల్‌ప్రదేశ్‌లో సాగు భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కొనటానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాల జనాలు ఉత్తరాఖండ్‌లో 250 చదరపు మీటర్లకు మించి భూమిని కొనే ఛాన్స్ లేకుండా రూల్ పెట్టారు. నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో ఇలాంటి మరిన్ని ఆంక్షలు, నిషేధాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో కూడా ఈ తరహా కట్టుబాట్లు ఉండాలనేదే అక్కడి బీజేపీ నేతల డిమాండ్.
అపోహ పడొద్దు
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా ఉండటానికి కారణమైన ఆర్టికల్–370ని; అక్కడ శాశ్వత నివాసానికి సంబంధించిన ఆర్టికల్–35ఏని తొలగించడంపై అనే క అపోహలున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడికి రావొచ్చని, ప్రాపర్టీ కొనుక్కోవచ్చని అనుకుంటున్నారు. ఏ రాష్ట్రానికైనా వర్తించే లోకల్, నాన్‌లోకల్ క్రైటీరియా జమ్మూ కాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి. వ్యక్తి యూనియన్ టెర్రిటరీ ప్రాంతాల్లో భూములు కొనే అర్హత పొందాలన్నా, జాబులు కొట్టాలన్నా కంపల్సరీగా నిర్దేశిత కాలం అక్కడే ఉండాలి. దీనికోసం స్కూలు, కాలేజీల్లో చదువుకునే తరగతులను బట్టి అర్హత నిర్ణయించడం అవుతుంది. ఎప్పటి నుంచో ఉంటున్నవారికి ప్రయారిటీ ఇవ్వాలి.
– రవీందర్ రైనా జమ్మూకాశ్మీర్ బీజేపీ ప్రెసిడెంట్