భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని కర్మర్హ గ్రామంలో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన బంకర్లను స్థానికులు శుభ్రం చేసుకుంటున్నారు. యుద్ధాలు జరిగే సమయంలో ప్రజలు ఆ బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకుంటారు. గతంలో పాక్, ఇండియా భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఈ బంకర్లలోకే పోయి తలదాచుకున్నామని, పహల్గాం ఘటన దురదృష్టకరమని కర్మర్హ గ్రామస్తుల్లో ఒకరు మీడియాతో చెప్పారు.

కర్మర్హ గ్రామస్తుల్లో మరొకరు మాట్లాడుతూ.. బంకర్లు ఉన్న విషయం మర్చిపోయి ఈ మధ్య ప్రశాంతంగా బతుకుతున్నామని.. ఇప్పుడు మళ్లీ బంకర్లను శుభ్రం చేసుకుని వాటిల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత పరిస్థితులను కర్మర్హ గ్రామస్తులు ఆకాంక్షించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏ క్షణమైనా బంకర్లలోకి వెళ్లిపోతామని కర్మర్హ గ్రామస్తులు చెప్పారు. 

పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది. ఇండియా పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఎల్ఓసీ వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా.. మన  బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ  వేటను ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్లోని అన్ని ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతున్నది. శుక్రవారం ఉదయం బందిపొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని బలగాలు మట్టుబెట్టాయి. 

అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ.. తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది. రాజస్థాన్లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్కు హెచ్చరికలు పంపింది. టెర్రరిస్టులు నరమేధానికి పాల్పడిన బైసరన్ స్పాట్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితిపై ఆయన రివ్యూ నిర్వహించారు.