కశ్మీర్ కానిస్టేబుల్‌ అబ్దుల్‌కు  కీర్తి చక్ర.. అవార్డు అందుకున్న భార్య

కశ్మీర్ కానిస్టేబుల్‌ అబ్దుల్‌కు  కీర్తి చక్ర.. అవార్డు అందుకున్న భార్య

దేశ రక్షణలో తన ప్రాణాలను త్యాగం చేసిన జమ్ము కశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ కలాస్‌కు భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది.  అమరుడైన ఆ హెడ్ కానిస్టేబుల్ భార్య ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో 84 గ్యాలంటరీ అవార్డులను కోవింద్ ప్రదానం చేశారు. ఇందులో భాగంగా లఢఖ్ సరిహద్దుల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర ప్రకటించగా.. దానిని ఆయన భార్య సంతోషి అందుకున్నారు. అలాగే జమ్ము కశ్మీర్‌‌లో చొరబడిన పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ కలాస్‌కు కీర్తి చక్ర, ఎస్పీవో బిలాల్ అహ్మద్‌కు శౌర్య చక్ర అందజేశారు. 2019లో పుల్వామాలో జరిగిన కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్‌లో పాల్గొన్న అబ్దుల్ తమ శౌర్య ప్రతాపాలను చూపారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముష్కరులతో పోరాడి అమరులయ్యారు. దీంతో ఆయనకు కీర్తి చక్ర అవార్డును కేంద్రం ప్రకటించింది. అమరుడైన అబ్దుల్ రషీద్ కలాస్‌ తరఫున ఆయన భార్య తస్లీమా బేగం.. రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు.

అమరుడైన బిలాల్ తరఫున శౌర్య చక్ర అందుకున్న తల్లి

2019లో జమ్ము కశ్మీర్‌‌లోని బారాముల్లాలో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఎస్పీవో బిలాల్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌‌లో ముందుండి పోరాడారు. ఉగ్రవాదుల బారి నుంచి సామాన్య పౌరులను కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన బిలాల్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన ధీరత్వానికి గుర్తుగా భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది. దీనిని ఈ రోజు బిలాల్ తల్లి సారా బేగం.. రాష్ట్రపతి నుంచి అందుకున్నారు.