
బెంగళూరు: కర్నాటక మెడికల్ కాలేజీలో జూనియర్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన అతడిని సీనియర్లు కొట్టారు. విజయపుర జిల్లాలోని స్థానిక అల్ అమీన్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అనంత్‌నాగ్‌కు చెందిన హమీమ్, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఆ కాలేజీ ఆవరణలో 2019, 2022 బ్యాచ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీనిని చూసేందుకు హమీమ్ అక్కడకు వెళ్లాడు.
అయితే, బౌండరీ లైన్ బయటే ఉండాలని ఓ సీనియర్ ఆదేశించాడు. దీంతో దూరం నుంచి మ్యాచ్ చూస్తున్న హమీమ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని మరికొందరు సీనియర్లు కోరారు. దీనికి హమీమ్ నిరాకరించడంతో ర్యాగింగ్ చేశారు. పాటలు పాడాలని, డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు.
అదే రోజు రాత్రి దాదాపు ఎనిమిది మంది సీనియర్లు హామీమ్ హాస్టల్ రూమ్ కు వెళ్లారు. అతడ్ని దారుణంగా కొట్టారు. క్షమాపణలు చెప్పాలని బలవంతం చేస్తూ వీడియో తీసేందుకు ప్రయత్నించారు.