
న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి విషం కక్కింది. కాశ్మీర్ ముమ్మాటికీ మాదేనని.. ఏ శక్తి దానిని మా నుంచి వేరు చేయలేదని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రెండు దేశాల మధ్య అగ్గిరాజేశాయి. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ అదే రీతిలో దిమ్మతిరిగే పోయే రిప్లై ఇచ్చింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై గురువారం (ఏప్రిల్ 17) మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని ఆయన నొక్కి చెప్పారు. భారత భూభాగమైన కశ్మీర్ పాక్ జీవనాడి ఎలా అవుతోందని ప్రశ్నించారు.
కాశ్మీర్‌పై పాక్‌కు ఎలాంటి హక్కు లేదని.. కశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భామేనని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌కు కాశ్మీర్‌తో ఏమైనా సంబంధం ఉందంటే కేవలం అది.. పాక్ చట్టవిరుద్ధంగా కశ్మీర్లో ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడం మాత్రమేనని జైశ్వాల్ కౌంటర్ ఇచ్చారు.
అంతకుముందు ఓ కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. అది మా జీవనాడి (జుగులార్ సిర). కశ్మీర్‌ను మేం ఎప్పటికీ మరచిపోము. మా కాశ్మీర్ సోదరుల వీరోచిత పోరాటాన్ని వదిలిపెట్టము’’ అని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా హిందువులపైన మునీర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా పాకిస్తాన్ కథ చెప్పాలి. మన పూర్వీకులు జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం హిందువుల కంటే భిన్నంగా ఉన్నామని భావించారు.
మన మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నంగా ఉంటాయి. అదే రెండు దేశాల విభజన సిద్ధాంతానికి పునాది వేసింది. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులు దేశ రాయబారులు. వారంతా ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారు. వాళ్లకు భారతీయులతో సంబంధం లేదు’’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జనరల్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. ఈ క్రమంలో దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు.