గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కరోనా కలకలం

కశ్యప్‌, గురుసాయి, ప్రణయ్‌, ప్రణవ్‌ జెర్రీకి కరోనా

సైనా నెహ్వాల్‌కు నెగెటివ్‌

హైదరాబాద్‌: పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కరోనా కలకలం. తెలుగు షట్లర్‌, కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ పారుపల్లి కశ్యప్‌ సహా ఇండియాకు చెందిన నలుగురు టాప్‌ షట్లర్లు కరోనా బారినపడ్డారు. కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, గురుసాయిదత్‌తోపాటు డబుల్స్‌ స్పెషలిస్ట్‌ ప్రణవ్‌ జెర్రీ చోప్రాకు కరోనా పాజిటివ్‌గా తేలిందని  గోపీ అకాడమీ వర్గాలు శనివారం వెల్లడించాయి. వీరంతా ప్రస్తుతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపాయి. ‘ఈ నలుగురు ప్లేయర్లలో ఒకరు ఇటీవల కరోనాకు సంబంధించిన లక్షణాలతో బాధపడ్డారు. దాంతో ముందుజాగ్రత్తగా అందరూ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకున్నారు. అందులో కశ్యప్‌, గురు, ప్రణయ్‌, ప్రణవ్‌కు పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. కశ్యప్‌ భార్య సైనా నెహ్వాల్‌తోపాటు, గురు సతీమణి అమూల్యకు నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. అయితే తొలిసారి చేయించుకున్న కరోనా టెస్టుల్లో ఇటీవల తప్పుడు రిజల్ట్స్‌ వస్తుండటంతో డాక్టర్లు వీరికి మరోసారి టెస్టు చేయించుకోమని సూచించారు. దీంతో  సోమవారం మరోసారి కరోనా టెస్ట్‌ చేయించుకుంటారు’ అని తెలిపాయి.  కాగా,  గురుసాయిదత్‌ మినహా ఇతర ప్లేయర్లంతా కొన్ని రోజులుగా గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నారు. నవంబర్‌ 25న గురుసాయిదత్‌, అమూల్య వివాహం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇండియా చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ సహా పెద్ద సంఖ్యలో ప్లేయర్లు హాజరయ్యారు. దీంతో గోపీచంద్‌ అకాడమీలో ఉన్న ఇతర ట్రైనీలకూ ముందుజాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించారు. కాగా, డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ గతంలో కరోనా బారిన పడ్డాడు. అలాగే, గోపీ అకాడమీలో  కొన్ని నెలల క్రితం జరిగిన నేషనల్‌ క్యాంప్‌కు ముందు నిర్వహించిన టెస్టుల్లో మరో డబుల్స్‌ షట్లర్‌ సిక్కిరెడ్డికి పాజిటివ్‌ అని తేలినా..  సెకండ్‌ టెస్టులో
నెగెటివ్‌ వచ్చింది.