ఎఫ్‎బీఐ డైరెక్టర్‎గా కశ్యప్ పటేల్.. ఇండియన్​అమెరికన్‎కు ట్రంప్​ కీలక బాధ్యతలు​

ఎఫ్‎బీఐ డైరెక్టర్‎గా కశ్యప్ పటేల్.. ఇండియన్​అమెరికన్‎కు ట్రంప్​ కీలక బాధ్యతలు​

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్​తన ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. తాజాగా, ఇండియన్​అమెరికన్​అయిన కశ్యప్​ పటేల్‎కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్​బ్యూరో ఆఫ్​ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ)  డైరెక్టర్‎గా నియమించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్​సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ట్రుత్​ సోషల్​మీడియాలో పోస్ట్​ పెట్టారు.

 ‘‘ఎఫ్​బీఐ తదుపరి డైరెక్టర్‎గా కాష్ సేవలందిస్తారని నేను గర్వంగా చెప్తున్నా. ఆయన తెలివైన న్యాయవాది,  పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని బతికించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కాష్​ నియామకంతో ఎఫ్​బీఐకి పునర్​వైభవం వస్తుంది” అని పేర్కొన్నారు. 

తన మొదటి పదవీ కాలంలో కాష్​ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. డిఫెన్స్​ డిపార్ట్​మెంట్‎లో చీఫ్​ ఆఫ్​ స్టాఫ్‎గా, నేషనల్ ఇంటెలిజెన్స్​డిప్యూటీ డైరెక్టర్‎గా, కౌంటర్​ టెర్రరిజం సీనియర్​ డైరెక్టర్‎గా విశేష సేవలందించారని గుర్తు చేశారు. కాగా, కాష్ పటేల్ మొదట సెంట్రల్​ఇంటెలిజెన్స్‎కు నాయకత్వం వహిస్తారనే న్యూస్​ చక్కర్లు కొట్టినా.. ఈ పదవికి ట్రంప్ తన సన్నిహితుడు జాన్​రాట్​క్లిఫ్‎ను ఎంచుకున్నారు.

ట్రంప్‎కు  విధేయుడు

కాష్​పటేల్‎గా పిలిచే కశ్యప్​పటేల్‎కు ట్రంప్ విధేయుడిగా పేరున్నది. ట్రంప్​ మొదటి టర్మ్‎లో యూఎస్​ డిఫెన్స్​ డిపార్ట్​మెంట్​చీఫ్​ఆఫ్​ స్టాఫ్‎గా ఆయన పనిచేశారు. కశ్యప్​ కుటుంబ మూలాలు గుజరాత్‎లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఈస్ట్​ ఆఫ్రికాలో పెరిగారు. అయితే, అతడి తండ్రి ఉగాండాలో నియంత ఈదీ అమిన్​ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980 లో న్యూయార్క్​గార్డెన్​ సిటీలో పుట్టిన కశ్యప్..​ యూనివర్సిటీ ఆఫ్​ రిచ్​మండ్‎లో గ్రాడ్యుయేషన్​ పూర్తిచేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్​నుంచి లా పట్టా పొందారు. మయామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా, ఇతరత్రా వివిధ హోదాల్లో సేవలందించారు.