హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మణికొండ పుప్పాలగూడలోని BRC అపార్ట్మెంట్లో కస్తూరి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు నేరుగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లారు. చెన్నై పోలీసులను చూసిన కస్తూరికి వాళ్లు ఎందుకు వచ్చారో అర్థమైంది.
నానా రచ్చ చేయకుండా అరెస్ట్ విషయంలో పోలీసులకు సహకరించింది. సైలెంట్గా కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నై పోలీసులు తమిళనాడుకు(చెన్నై) తరలించారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కస్తూరిపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
300 ఏళ్ల కిందట రాజుల పాలనలో తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్లే తెలుగువారని, ఇప్పుడు వాళ్లు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును కస్తూరి ఆశ్రయించింది. కస్తూరి బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి నటి కస్తూరి పరారీలోనే ఉంది. ఆమెకు అరెస్ట్కు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని ఆమె ఇంటికి గత శనివారం చెన్నై పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆమె ఇంటి నుంచి పరారైంది.
ALOS READ | గచ్చిబౌలిలో సినీ నటి కస్తూరి అరెస్ట్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..!
ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె మొబైల్ నంబర్కు పోలీసులు కాల్ చేశారు. స్విచాఫ్ వచ్చింది. ఆమె పరారైందని పోలీసులకు ఫుల్ క్లారిటీ రావడంతో గత శనివారం నుంచి ఆమె కోసం వెతుకులాట సాగించారు. సరిగ్గా వారం రోజులకు.. ఈ శనివారం (నవంబర్ 16, 2024) చెన్నై నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీంకు హైదరాబాద్లో కస్తూరి దొరికిపోయింది. 50 ఏళ్ల వయసున్న కస్తూరి పలు సినిమాలతో పాటు పలు సీరియల్స్లో కూడా నటించింది. కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా తమిళనాడులోని మధురైలో కస్తూరి ఎన్నికల ప్రచారం చేసింది.