
‘మంచి కథలు, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి ‘కథాసుధ’ గొప్ప వేదిక’ అన్నారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ఆయనతో పాటు దర్శకుడు సతీష్ వేగేశ్న సూపర్ విజన్‌లో ఈటీవీ విన్‌లో ఇది ప్రసారం కానుంది. ప్రతి ఆదివారం ఓ కథతో అలరించబోతోంది. శనివారం టైటిల్, ప్రోమో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ కుటుంబం అంతా కలిసి చూడదగ్గ హెల్దీ కంటెంట్‌తో ఈటీవీ విన్ ఆకట్టుకుంటుంది.
కథాసుధ చాలా గొప్ప ఆలోచన. మంచి కథలు, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం గొప్ప విషయం. రాఘవేంద్రరావు గారు ఇలాంటివి ప్రోత్సహించడానికి ముందుకు రావడం నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఇందులో వచ్చే కథలన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘కొత్త దర్శకుల్ని, రచయితల్ని, నటీనటుల్ని పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది.
మంచి డైలాగ్స్, కథలు రాసిన వారిని ఇందులో సెలెక్ట్ చేసాం. కొత్తవారిని పరిచయం చేయడంలో ఉండే ఆనందం వేరు. ఇందులో ముఫ్ఫై నిమిషాల నిడివి గల నాలుగు సినిమాలు 17 రోజుల్లో తీశాం’ అని అన్నారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ‘ఐదు కథలని 20 రోజుల్లో తీశాం. ఈ కథలు అందర్నీ తట్టి లేపే జ్ఞాపకాలుగా ఉంటాయి’ అని చెప్పాడు. ఇలాంటి మంచి కథల్లో నటించడం చాలా ఆనందంగా ఉందని తనికెళ్ల భరణి అన్నారు. రైటర్ బీవీఎస్ రవి, నటులు బాలాదిత్య, సోనియా, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి పాల్గొన్నారు.