కామారెడ్డి బంద్ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హౌజ్ అరెస్ట్

కామరెడ్డి జిల్లా బంద్ సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నేడు కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటివద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే రైతులిచ్చిన బంద్ కు రమణారెడ్డి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

కాగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన బంద్ కు మద్దతుగా విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పూర్తి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ నేతలంతా బంద్ లో పాల్గొని, విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు కదం తొక్కారు. తమను సంప్రదించకుండా తమ భూములను ఇండస్ట్రియల్, గ్రీన్​జోన్​లో పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్​ ముందు బైఠాయించి, నిరసన తెలిపారు.