- కేసీఆర్ గజ్వేల్‌ను వదిలి కామారెడ్డిలోనే పోటీ చేయాలి
- కామారెడ్డిలో సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
- బీజేపీ కామారెడ్డి ఇన్ చార్జి కాటిపల్లి వెంటకటరమణారెడ్డి సవాల్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఖాయమైతే రెండు చోట్ల పోటీ చేయడం ఎందుకని, ఆయన గజ్వేల్వదిలి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో మాత్రమే కేసీఆర్ పోటీ చేసి గెలిస్తే, తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, కేసీఆర్ ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలని వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు.
జిల్లా పార్టీ ఆఫీస్‌లో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామన్నారు. దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందామన్నారు. ఇక్కడ కేసీఆర్ గెలుపు ఖాయమైతే, బూత్‌కు ఒక సీనియర్ లీడర్‌ను నియమించడం ఎందుకని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటన ప్రజల మదిలో మెదులుతూనే ఉంటుందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో చేసిన అరాచకాలు చాలవన్నట్లు కల్వకుంట్ల ఫ్యామిటీ కామారెడ్డిపై కన్నేసిందన్నారు.
పదేండ్లుగా నియోజకవర్గానికి రూపాయి ఇవ్వని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కేసీఆర్ పోటీ చేస్తున్నారని కోట్ల రూపాయల ప్రోసిడింగ్స్ ఇస్తున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఒక్క ఉద్యమ నాయకులు లేడని, కేసీఆర్ పోచమ్మ అయితే కేటీఆర్, కవిత, హరీశ్‌రావులు పోతరాజులు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇక్కడికి వస్తే తాను కరెంట్‌తీగలు పట్టుకొని, సప్లయ్ఎలా ఉందో చూపిస్తానన్నారు. టౌన్ప్రెసిడెంట్ విఫుల్జైన్, కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, నరేందర్, ప్రవీన్, లీడర్లు సురేశ్తదితరులు పాల్గొన్నారు.