కామారెడ్డి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : పార్టీ కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్​లో శుక్రవారం నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ఇచ్చిన  హామీలను నెరవేరుస్తానన్నారు.

ప్రజల వద్దకే పాలన అందించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామన్నారు. పార్టీ పార్లమెంట్ ​ఇన్​చార్జ్​బద్ధం మహిపాల్​రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు ఉద్దండులను ఓడించిన చరిత్ర వెంకటరమణారెడ్డితో పాటు, ఇక్కడి బీజేపీ కార్యకర్తలకు దక్కుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్​ఎన్నికల్లోనూ పనిచేయాలని సూచించారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార మాట్లాడుతూ..

అయిదేండ్ల పాటు ప్రజల పక్షాన చేసిన పోరాటాలు, ఉద్యమాలు కామారెడ్డిలో కాటిపల్లిని గెలిపించాయన్నారు. జిల్లా జనరల్ సెక్రెటరీ తేలు శ్రీనివాస్, జిల్లా వైస్​ప్రెసిడెంట్లు ఆకుల భరత్, వెంకట్​రెడ్డి,  అసెంబ్లీ కన్వీనర్​లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్​ లీడర్ ​మోటూరి శ్రీకాంత్​తదితరులు పాల్గొన్నారు.