నేను సైతం కామారెడ్డి కోసం : వెంకటరమణారెడ్డి

  •  రూ.150 కోట్లతో కామారెడ్డి మెనిఫెస్టో ప్రకటించిన వెంకట రమణారెడ్డి     
  • సొంత నిధులతో అభివృద్ధి పనులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నుంచి బీజేపీ టికెట్​ఆశిస్తున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి ‘నేను సైతం కామారెడ్డి కోసం’  పేరుతో రూ.150 కోట్ల సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీస్​లో మెనిఫెస్టోను రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి ఉచిత విద్య, వైద్యం, రైతు సేవా కేంద్రాలు,  ప్రతి గ్రామంలో రైతు కల్లాల నిర్మాణం, ఉచిత ఉపాధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తన తండ్రి కేపీ రాజిరెడ్డి జన సేవా ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ పనులు కొనసాగుతాయన్నారు.

కామారెడ్డిలో 2 ఎకరాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్​ నిర్మాణం,  కార్పొరేట్​ స్థాయిలో వైద్య సేవలు, ప్రతి మండల కేంద్రంలో ఒక జనరల్​హాస్పిటల్, డయాగ్నోస్టిక్ ​సెంటర్​ను నిర్మిస్తామన్నారు. వారానికోసారి స్పెషలిస్టులతో హెల్త్​క్యాంప్​లు నిర్వహిస్తామని చెప్పారు. అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో మోడల్​ స్కూళ్లను​ కట్టిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుపు పరిచేందుకు ప్రతి మండలకేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి పంటల సాగుపై శిక్షణనిస్తామన్నారు.  ప్రతి గ్రామంలో  రైతు కల్లాలు కట్టిస్తామన్నారు.