శ్రీరాముడి మీద భక్తిని ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటున్నారు. సూరత్‌కి చెందిన వజ్రాల వ్యాపారి , రసేష్ జువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా. ఐదు వేల అమెరికన్ వజ్రాలను వాడి అయోధ్య రామమందిరం థీమ్‌తో నెక్లెస్ తయారుచేయించాడు. ఆ నెక్లెస్‌ను అయోధ్యలోని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వబోతున్నాడు.
ఈ నెక్లెస్‌ను 40 మంది కళాకారులు 35 రోజుల్లో పూర్తి చేశారు. అందుకు ఐదు వేల అమెరికన్ డైమండ్స్‌తో పాటు, రెండు కిలోల వెండి వాడారు. ఈ నెక్లెస్‌లో అయోధ్య రామమందిరం, సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడిని చూడొచ్చు. ‘దీన్ని వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు తయారుచేయలేదు. రామ మందిరానికి మనస్ఫూర్తిగా బహుమతిగా ఇవ్వాలని డిజైన్ చేశాం’ అని చెప్పాడు కౌశిక్.