జమ్మికుంట, వెలుగు :మహిళా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్పీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంట్లో మహిళలు లేరా..? అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిపై దాడి చేసినపుడు మీరంతా ఏమయ్యారన్నారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని, ధైర్యముంటే రాజీనామా చేసి ఈసారి కవిత మీద పోటీ చేసి గెలవాలని సవాల్‌విసిరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కేడీసీసీ వైస్ చైర్మన్ రమేశ్, ఎంపీపీ మమత, జెడ్పీటీసీ శ్రీరాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రోళ్లవాగుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు
జగిత్యాల, వెలుగు: బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్ట్ కు రూపాయి కూడా కేటాయించని కాంగ్రెస్ నేతలకు దానిపై మాట్లాడే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం ఆయన బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రోళ్లవాగుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జనవరి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి రబీ పంటకు సాగునీరు అందించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ లీడర్లు, ఆఫీసర్లు ఉన్నారు.
కాళేశ్వరంతో కరీంనగర్ సస్యశ్యామలం
కరీంనగర్ రూరల్, వెలుగు: కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలమైందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చామనపల్లి రాజసముద్రం చెరువు నింపడం కోసం డీ-87 కెనాల్ నుంచి రూ.65 లక్షలతో నిర్మించనున్న కాలువ పనులకు మినిస్టర్శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువులన్నీ మరమ్మతు చేసుకోవడంతో బీడు భూములన్ని సాగులోకి వచ్చాయన్నారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు, నీటి యుద్ధాలు జరిగేవని, కాళేశ్వరంతో మత్స్య సంపద బాగా పెరిగిందన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు మానేరు వాగుపై 5, ఇరుకుల్ల వాగుపై 4 చెక్ డ్యామ్ లు నిర్మించామని, కరీంనగర్ నియోజకవర్గంలో చెరువులన్నీ నింపుకున్నామన్నారు. కాలువ నిర్మాణ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజకీయ కోణంలోనే చూడాలి..
కరీంనగర్: ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడబిడ్డ అని, ఎంపీ అరవింద్, కవిత వివాదాన్ని రాజకీయ కోణంలోనే చూడాలని మంత్రి అన్నారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ఎంపీ ఇంటిపై దాడిని ఏ కులానికో, వర్గానికో ఆపాదించరాదన్నారు. తాను మున్నూరు కాపు అయినంత మాత్రాన దాడిని ఆ కులంపై దాడిగా భావించరాదన్నారు. ఎంపీగా అరవింద్ హుందాగా మాట్లాడాలని సూచించారు. అనంతరం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఫిబ్రవరిలో నిర్వహించే నుమాయిష్ ను మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ లో ఏటా జరిగే ఎగ్జిబిషన్ మొదటిసారి కరీంనగర్ లో గొప్పగా జరుపుకుందామని చెప్పారు. అనంతరం చామనపల్లిలో పద్మశాలి కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ లలిత, లీడర్లు పాల్గొన్నారు.
‘పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు’
సుల్తానాబాద్, వెలుగు: పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికుల పిల్లలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రూపేశ్ హెచ్చరించారు. శనివారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇటుక బట్టీల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇటుక బట్టీలు సందర్శించినప్పుడు పిల్లలతో పనులు చేయించడం చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత బట్టీల యజమానులదేనని, కార్మికులపై దాడులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ సారంగపాణి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై లు ఉపేందర్ రావు, వినీత పాల్గొన్నారు.
బైండోవర్ ఉల్లంఘన రూ.లక్ష జరిమానా
మెట్ పల్లి, వెలుగు : గుడుంబా అమ్ముతూ ఎక్సైజ్ ఆఫీసర్లు దొరికిపోయి బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించినట్లు మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ శని వారం తెలిపారు. కథలాపూర్ మండలం కలిగోటకు చెందిన లవుడియా చంద్రునాయక్ గుడుంబా అమ్ముతూ ఆగస్టు 16న దొరికిపోవడంతో ఎక్సైజ్ ఆఫీసర్లు కథలాపూర్ తహసీల్దార్ ముందు అతడిని బైండోవర్ చేశారు. అయితే పద్ధతి మార్చుకోని చంద్రునాయక్ మళ్లీ గుడుంబా అమ్ముతూ నవంబర్ 5న ఎక్సైజ్ ఆఫీసర్లకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన ఆఫీసర్లు బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడిని తహసీల్దార్ రవీందర్ రావు ముందు ప్రవేశపెట్టారు. దీంతో తహసీల్దార్ నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు.
ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం
జమ్మికుంట, వెలుగు: సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్దిష్టిబొమ్మను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు అధ్వర్యంలో శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సీఎం అనే గౌరవం లేకుండా, ఆడపడుచు అని చూడకుండా ఎంపీ వ్యాఖ్యలు చేయడం హేయమైనదన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, లీడర్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అగ్రగామి ఎస్ఆర్ఆర్ కాలేజీ
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. శనివారం ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ ప్రియాంకతో కలిసి కరుణ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణ సంపాదకీయంలో ప్రచురించిన హయ్యర్ ఎడుకేషన్ ఇన్ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజు, లెక్చరర్స్ శోభ, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మన ఊరు-, మనబడితో సౌకర్యాల కల్పన
గంగాధర: మన ఊరు,- మన బడి పథకం కింద చేపట్టిన పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని వాకాటి కరుణ అన్నారు. గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆమె పరిశీలించారు. స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు, ఎంపీడీఓ భాస్కర్‌రావు, అధికారులు
పాల్గొన్నారు.
‘బాలలను వేధించొద్దు’
కరీంనగర్ టౌన్, వెలుగు: బాలలను ఎవరూ వేధింపులకు గురిచేయొద్దని ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు. శనివారం బాలల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రిన్సిపల్ అర్జున్ రావుతో కలిసి ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులువిధుల్లో ఉన్నపుడు పిల్లలు ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే చైల్డ్ లైన్ నంబర్1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్, లెక్చరర్లు తిరుపతి, స్వామి, కిరణ్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
సింగరేణి ఓసీపీ 5 ముట్టడి బొగ్గు లారీలను అడ్డుకున్న కాలనీ వాసులు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ 5 వల్ల తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్ ప్రజలు శనివారం ప్రాజెక్ట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. బంకర్‌ను ముట్టడించి బొగ్గు లారీలు వెళ్లకుండా అడ్డగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు రజిత మాట్లాడుతూ బ్లాస్టింగ్‌లతో ఇళ్లు దెబ్బతింటున్నాయన్నారు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో ఆందోళన
విరమించారు.