- ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు
- రాష్ట్రంలో కొత్తగా 1026 కి.మీ‘కవచ్’పనులు
- రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 5,337 కోట్లు
- తెలంగాణలో 100% రైల్వేలైన్ల విద్యదీకరణ పూర్తి
- త్వరలో దేశ వ్యాప్తంగా 100 నమో భారత్ రైళ్లు
- ఏపీకి రికార్డు స్థాయిలో రూ. 9,417 కోట్ల కేటాయింపు
- కాజీపేట స్టేషన్ అభివృద్ధి చేస్తున్నం
ఢిల్లీ: సికింద్రాబాద్ కేంద్రంగా ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ఏర్పాటు చేయబోతున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో వంద శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ పూర్తయిందని వివరించారు. రూ. 41,677 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ప్రకటన ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 5,337 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు.
రైలు ప్రమాదాల నివారణపై ప్రధానంగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇటీవల పలుచోట్ల రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పట్టాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఉద్దేశించిన కవచ్ టెక్నాలజీపై ఈ సారి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1026 కిలోమీటర్ల మేర కవచ్ పనులు చేపడుతామని అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
మరిన్ని వందే భారత్ రైళ్లు
తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని వాటిని పెంచనున్నట్టు తెలిపారు. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని అన్నారు. త్వరలో దేశమంతా దాదాపు 50 నమో భారత్ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకురానున్నామని, వీటి ద్వారా పేదలకు ఎక్కువగా లబ్ధి కలుగుతుందని వివరించారు. 100 అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 1000 కి.మీ వరకు 450 రూ ప్రయణించేలా నాన్ ఏసీలో అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఏపీకి రూ. 9,417 కోట్లు
ఈ సారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు రూ. 9417 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. 84,559 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రాసెస్ లో ఉన్నాయని అన్నారు. 73 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేశామన్నారు. 100% విద్యుదీకరణ పూర్తయిందని వివరించారు. 1,560 కిమీ రైల్వే ట్రాక్ నిర్మించామని చెప్పారు. 8 వందే భారత్ రైళ్లు 16 జిల్లాలను కలుపుతూ సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు.
ALSO READ | తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఫైనల్