నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా యాదాద్రి కలెక్టరేట్‌‌లో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ పమేలా సత్పతి మాట్లాడుతూ కవులు తమ కవితల ద్వారా సమస్యలను ఎత్తి చూపుతూ, వాటి పరిష్కారానికి కృ-షి చేయాలని సూచించారు. మహిళా కవుల సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్లు డి.శ్రీనివాస్‌‌రెడ్డి, దీపక్‌‌ తివారి, ఏవో నాగేశ్వరాచారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎక్సైజ్‌‌ ఎస్పీ నవీన్‌‌కుమార్‌‌, జిల్లా రచయితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రంగయ్య, బండారు జయశ్రీ ఉన్నారు.

మునుగోడు గడ్డ.. కాంగ్రెస్‌‌ అడ్డా అని నిరూపించాలె  

చండూరు, వెలుగు : మునుగోడు గడ్డ కాంగ్రెస్‌‌ అడ్డా అని మరోసారి నిరూపించాలని పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నాంపల్లి, మర్రిగూడలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఇచ్చిన పదవులు అనుభవించి కాంట్రాక్టల కోసం బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి ప్రజలు క్షమించరన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌‌, డీజిల్‌‌, పెట్రోల్‌‌ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతోందని విమర్శించారు. అబద్ధాల టీఆర్‌‌ఎస్‌‌, మతతత్వ బీజేపీని నమ్మొద్దన్నారు. సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌‌ శంకర్‌‌నాయక్‌‌, నాయకులు అంజన్‌‌ కుమార్‌‌ యాదవ్‌‌, గాలి అనిల్‌‌కుమార్‌‌, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి, చెల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్న కైలాశ్‌‌నేత పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ మధ్యే పోటీ

మునుగోడు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ మధ్యే పోటీ ఉంటుందని పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌‌ మునుగోడు మండల ఇన్‌‌చార్జి విజయ రమణారావు చెప్పారు. మంగళవారం మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్‌‌రెడ్డి అభివృ-ద్ధిని అడ్డుపెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీటీసీ పోలగోని సైదులు, మాజీ ఎంపీటీసీ భాస్కర్‌‌, అన్వర్‌‌, పాల్వ చెన్నారెడ్డి పాల్గొన్నారు.

కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన్రు

సంస్థాన్‌‌నారాయణపురం, వెలుగు : కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌‌ పార్టీని మోసం చేశారని సంస్థాన్‌‌నారాయణపురం ఉప ఎన్నికల ఇన్‌‌చార్జి గండ్ర సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్‌‌రెడ్డి బీజేపీలోకి వెళ్తే ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. నాయకులు గడ్డం మురళీధర్‌‌రెడ్డి, భిక్షపతినాయక్, చిలువేరు కృష్ణ, ఎస్‌‌కే.బడేసాబ్‌‌ పాల్గొన్నారు.

రాష్ట్రానికి కేసీఆర్‌‌ పాలనే పెద్ద సమస్య

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ పాలనే రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారిందని కాంగ్రెస్‌‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు. కేసీఆర్‌‌ను గద్దె దింపుతనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బీర్ల ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెంలో ఏర్పాటు చేసిన వాటర్‌‌ ప్లాంట్‌‌ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను పెంచి పేదలపై భారం మోపుతున్నాయన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట, ఆలేరు కాంగ్రెస్‌‌ అధ్యక్షులు కానుగు బాలరాజుగౌడ్, రాజు, చొల్లేరు ఎంపీటీసీ అరుణ, మర్రిగూడెం సర్పంచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

గిరిజన రిజర్వేషన్లు పెంచాలి

సూర్యాపేట, వెలుగు : గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు బాలు నాయక్‌‌ డిమాండ్‌‌ చేశారు. సూర్యాపేటలోని ఆ సంఘం భవనంలో మంగళవారం జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. గిరిజనులకు సరైన అవకాశాలు అందకపోవడంతో విద్య, ఉపాధికి దూరం అవుతున్నారన్నారు. అన్ని పార్టీలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లంబాడీ విద్యార్థి సేన సూర్యాపేట మండల అధ్యక్షుడిగా ధరావత్‌‌ శివనాయక్‌‌, ఉపాధ్యక్షుడిగా బానోతు సేవాలాల్‌‌ను నియమించారు. కార్యక్రమంలో లంబాడీ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు హరీశ్‌‌నాయక్‌‌, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ రవినాయక్‌‌, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహనాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్‌‌నాయక్‌‌ పాల్గొన్నారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

గరిడేపల్లి, వెలుగు : కారు ఢీకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ప్రమాదం సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన యర్రగొర్ల పెద్దలక్ష్మమ్మ (65) రాత్రి స్థానిక రామాలయం వద్ద రోడ్డు దాటుతోంది. ఇదే టైంలో హుజూర్‌‌నగర్‌‌ వైపు నుంచి కారులో వస్తున్న వల్లపు ప్రకాశ్‌‌రెడ్డి ఆమెను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మమ్మను మిర్యాలగూడ హాస్పిటల్‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ మంగళవారం ఉదయం చనిపోయింది. లక్ష్మమ్మ కుమారుడు భాస్కర్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండల్‌‌రెడ్డి తెలిపారు.

టీఆర్‌‌ఎస్‌‌ సభను సక్సెస్‌‌ చేయండి

మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న నిర్వహించే టీఆర్‌‌ఎస్‌‌ ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్‌‌ చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తల మీటింగ్‌‌లో వారు మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌ వల్లే నల్గొండ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని విమర్శించారు. వారి మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. కార్యకర్తల డబ్బులతో గెలిచిన రాజగోపాల్‌‌రెడ్డి వారిని నట్టేట ముంచారన్నారు. టీఆర్ఎస్‌‌ క్యాండిడేట్‌‌ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మునుగోడులో కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. అనంతరం జన సమీకరణకు కమిటీలను నియమించారు.  కార్యక్రమంలో నాయకులు నారబోయిన రవి, మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, అనంత స్వామిగౌడ్, జాజుల అంజయ్య, శ్రీనివాస్‌‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌‌ఎస్‌‌ దాడులకు బదులు తీర్చుకుంటాం

యాదాద్రి, వెలుగు : టీఆర్‌‌ఎస్‌‌ నాయకుల దాడులకు బదులు తీర్చుకుంటామని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌, జిల్లా ఇన్‌‌చార్జి నందకుమార్‌‌ యాదవ్‌‌ హెచ్చరించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో జరిగిన దాడిలో గాయపడి ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్న గుండాల మండలం పెద్దపడిశాల సర్పంచ్‌‌ రావుల మల్లేశ్‌‌ను మంగళవారం సికింద్రాబాద్‌‌లో వారు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు. ‘మేము దాడులు చేయదలుచుకుంటే టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు బయట తిరగగలరా ?’ అని ప్రశ్నించారు. సహనానికి హద్దు ఉంటుందని, సరైన టైంలో తామేంటో చూపిస్తామన్నారు.

నారసింహుడి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా గెలిచా..

యాదగిరిగుట్ట, వెలుగు : లక్ష్మీనారసింహుడి ఆశీస్సులతోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ప్రభుత్వ విప్‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌రెడ్డి చెప్పారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలోని వైకుంఠద్వారం వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌‌ను ఆమె కట్‌‌ చేశారు. ఈ సందర్భంగా సునీత దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ గడ్డమీది రవీందర్‌‌గౌడ్‌‌, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మైలార్‌‌గూడెం ఉప సర్పంచ్‌‌ మారెడ్డి కొండల్‌‌ రెడ్డి, టీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీత పుట్టినరోజు వేడుకలను యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. 

పదవులు అనుభవించాక పార్టీ మారుతున్రు

యాదాద్రి, వెలుగు : టీఆర్‌‌ఎస్‌‌లో అన్ని పదవులు అనుభవించిన కొందరు వ్యక్తులు ఇప్పుడు పార్టీ మారుతున్నారని డీసీసీబీ చైర్మన్‌‌ గొంగిడి మహేందర్‌‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. సీనియర్లను కాదని పదవులు ఇస్తే ఇప్పుడు పార్టీకే ద్రోహం చేస్తున్నారన్నారు. మునుగోడు బైపోల్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌‌ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు.

ఫ్రీడమ్‌‌ కప్‌‌ పోటీలు షురూ...

యాదాద్రి/సూర్యాపేట/నల్గొండఅర్బన్‌‌, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న  ఫ్రీడమ్‌‌ కప్‌‌ పోటీలు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభం అయ్యాయి. భువనగిరిలో కలెక్టర్‌‌ పమేలా సత్పతి, సూర్యాపేటలో కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌, నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ వినయ్‌‌ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌‌, లాంగ్‌‌ జంప్‌‌, టగ్‌‌ ఆఫ్‌‌ వార్‌‌ పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి ఈ నెల 18న ప్రైజ్‌‌లు అందజేయనున్నట్లు చెప్పారు. 

భూమి కోసమే తమ్ముడి హత్య

వల్లాపురం కేసులో ఐదుగురిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు

మునగాల (నడిగూడెం), వెలుగు : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌‌రెడ్డి మంగళవారం నడిగూడెం పోలీస్‌‌స్టేషన్‌‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొప్పెర భద్రయ్య, వీరబాబు అన్నదమ్ములు. వల్లాపురం శివారులోని 12 గుంటల భూమి విషయంలో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భూమి తమకు దక్కాలంటే తన తమ్ముడైన వీరబాబును హత్య చేయాలని నిర్ణయించుకొని భార్య సరోజిని, కూతురు నవ్యతో కలిసి ప్లాన్‌‌ చేశాడు. ఇందులో భాగంగా తన వదిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన పర్వత సుభద్ర, ఆమె కొడుకు వీరప్రసాద్‌‌ను పిలిపించుకున్నాడు. ఈ నెల 14న ఉదయం పొలంలో నాటు వేస్తుండగా విషయం తెలుసుకున్న వీరబాబు అక్కడికి వెళ్లి ఆపాలని కోరాడు. దీంతో ఐదుగురు కలిసి వీరబాబు కండ్లలో కారం చల్లి, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్‌‌లోనే చనిపోయాడు. తర్వాత ఐదుగురు పక్కనే ఉన్న చెరుకు తోటలోకి వెళ్లి దాడి చేసిన కర్రలను అక్కడ దాచిపెట్టి, తమ దుస్తులు మార్చుకొని పారిపోయారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేయడంతో భద్రయ్య, అతడి కుటుంబ సభ్యులు కలిసి వీరబాబును హత్య చేసినట్లు తెలిసింది. ఐదుగురు బుద్ధారంలో ఉన్నట్లు తెలియడంతో మునగాల సీఐ ఆంజనేయులు, నడిగూడెం ఎస్సై ఏడుకొండలు సిబ్బందితో వెళ్లి మంగళవారం వారిని అరెస్ట్‌‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

ఊరూరా ‘జనగణమన’

‘జనగణమన అధినాయక జయహే’ గీతంతో మంగళవారం ఉమ్మడి జిల్లా మారుమ్రోగింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని మెయిన్‌‌ సెంటర్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, స్టూడెంట్లు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు భారీ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు.