- మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేతుషార్ గోవింద్ రావు
- పలు చోట్ల నియోజకవర్గ స్థాయిబీజేపీ నేతల సమావేశాలు
నెట్వర్క్, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాష్ట్ర సీఎం కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముత్కెడ్ బీజేపీ ఎమ్మెల్యే తుషార్ గోవింద్ రావు రాథోడ్ అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో నియోజకవర్గస్థాయి బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న గోవింద్ రావు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిధులను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజ్మీరా హరినాయక్, పెంబి జడ్పీటీసీ జాను బాయ్, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్, మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మహారాష్ట్రలోని ఔసా ఎమ్మెల్యే అభిమన్యు దత్తాత్రేయ పవార్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ ఆనంద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాయగావ్ఎమ్మెల్యే రాజేశ్ పవార్ భైంసాలో మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి బీజేపీని అధికారంలోకి తీసుకరావాలని నేతలకు సూచించారు.
ప్రజల కోసం పని చేస్తున్న ప్రతీ కార్యకర్తకు మున్ముందు మంచి రోజులు ఉంటాయన్నారు. జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్, సెగ్మెంట్కన్వీనర్ సాయినాథ్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో గడ్చిరోలి ఎమ్మెల్యే దేవ్ రావు హోళీ, కాగజ్ నగర్ లో చిముర్ ఎమ్మెల్యే కీర్తి కుమార్ బాంగడియా పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్వాయి హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన ప్రవాస్ ఎమ్మెల్యే కార్యక్రమంలో గడ్చిరోలి జిల్లా అర్మోరి ఎమ్మెల్యే కృష్ణ గజ్జ్బె పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బెల్లంపల్లి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్ణాటకలోని సులియా నియోజకవర్గ ఎమ్మెల్యే భగీరథి మురుల్యా, చెన్నూరు పట్టణంలోని పద్మశాలీ భవన్లో బెంగళూరు ఎమ్మెల్సీ కేశవ్‌ప్రసాద్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలన్నారు. ఈసారి బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.