మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే బ్లడ్ : కవిత

  •     కేసీఆర్‌‌‌‌ను ఎదుర్కోలేక నాపై, రామన్నపై కేసులు: కవిత
  •     వచ్చేది బీఆర్‌‌‌‌ఎస్ శకం.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వెల్లడి

నిజామాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రజల తరఫున ప్రశ్నించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై కేసులు పెడ్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అయితే, తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే బ్లడ్​ అని అన్నారు. రామన్న (కేటీఆర్‌‌‌‌), తనతో పాటు బీఆర్ఎస్ లీడర్లపై ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కణికల్లా బయటపడతామన్నారు. నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టే కష్టాలు పెట్టినా ఓర్చుకొని పిడికిలెత్తి నిలబడ్డానన్నారు. లిక్కర్ స్కాం, ఈడీ కేసులో జైలుకు వెళ్లాక ఆమె ఆదివారం మొదటిసారి నిజామాబాద్ వచ్చారు.

సుభాష్​నగర్‌‌‌‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం మాట్లాడారు. చైనా మన దేశంలో కొంత స్థలం ఆక్రమించుకుందని కామెంట్‌‌ చేసినా, ప్రజలకు మంచి జరగడం లేదని చెప్పినా కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినా.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌‌స్టాలో ప్రశ్నించే రీల్స్ పెట్టినా కేసులు నమోదు చేస్తూ, కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుపుతున్నారని మండిపడ్డారు. 

అధికారం టైం పాస్‌‌ కోసం కాదు..

అధికారం టైం పాస్‌‌ కోసం కాదని, తమ సమస్యలు పరిష్కరించుకోడానికే ప్రజలు అధికారమిచ్చారని కవిత అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డిగ్రీ చదువుకున్న ఆడ పిల్లలకు స్కూటీల పంపిణీ, మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఏమైందని, మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని నిలదీశారు. పింఛన్లు ఇప్పటికీ పెంచలేదని, రైతు భరోసా క్లోజ్ చేశారని మండిపడ్డారు. రుణమాఫీ రైతులందరికీ వర్తించలేదన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకుంటున్న దరఖాస్తులు బుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు.  సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, అందుకే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ప్రజలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని తెచ్చారని, బతుకమ్మను మాయం చేశారన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా తిరిగి బీఆర్‌‌‌‌ఎస్ శకం వస్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.