- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
- ఆయన ఎక్కడికెళ్లినా వెంటపడి ఓడిస్తానని వెల్లడి
- తాను కచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తానని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌లో తనపై పోటీ చేసే దమ్ము లేకే బీజేపీ ఎంపీ అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పారిపోతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ను సవాల్‌చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. కేసీఆర్ పేరు చెప్తేనే బీజేపీ, కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారన్నారు. గురువారం ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి మీడియాతో కవిత మాట్లాడారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి అర్వింద్ దారుణంగా మట్లాడుతున్నారని మండిపడ్డారు.
పదేండ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం సున్నా అని పేర్కొన్నారు. ఐటీ హబ్‌తో నిజామాబాద్ దశ మారబోతుందని, ఉద్యోగాల కల్పనపై అర్వింద్ అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. నిజామాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు, పథకాలు చేపడుతున్నామని, అందులో ఎంపీగా నీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులిచ్చారని చెప్పారు.
నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా..
‘‘నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని ఎంపీ అర్వింద్ పదే పదే అడుగుతున్నారు. నేను కచ్చితంగా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తా. నిజామాబాద్ నా సొంతూరు.. అత్తగారి ఊరు.. నేను బతికినా, సచ్చినా.. నా కట్టె కాలుడు కూడా ఇక్కడే. తాను పారిపోయేదాన్ని కాదు”అని కవిత పేర్కొన్నారు. అర్వింద్ కోరుట్లకు పోయినా అక్కడికి వెళ్లి వెంటపడి ఓడిస్తానని శపథం చేశారు. ఎమ్మెల్యేగా, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వస్తానన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించడం సరికాదన్నారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్లే ఎన్నికల కమిషనర్లు అవుతారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొచ్చే అంశమన్నారు. ఐటీ హబ్‌తో వచ్చే మొత్తం ఉద్యోగాలు 750 అయితే, మొదటి రోజే 280 మందిని నియమించామన్నారు. ఐటీ టవర్‌ను చూసి కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
ఎంపీగా గెలిచి 20 ఏండ్లు వెనక్కి నెట్టారు: బాజిరెడ్డి
అర్వింద్ ఎంపీగా గెలవడంతో అభివృద్ధిలో నిజామాబాద్ 20 ఏండ్లు వెనక్కి పోయిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఆయన సోషల్ మీడియాలో ఉంటారే తప్ప నియోజకవర్గంలో కనిపించరని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదన్నారు. ఎంపీగా ఇంకో నాలుగైదు నెలల టైం ఉందని, దాన్నైనా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.