గ్రూప్​ 1ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలి..సీఎం రేవంత్​ రెడ్డికి కవిత లేఖ

గ్రూప్​ 1ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలి..సీఎం రేవంత్​ రెడ్డికి కవిత లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కారు.. ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నదని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గ్రూప్​ 1 నిర్వహణలో సర్కారు నిర్లక్ష్యం వహించిందని, దీని వల్ల వేలాది మంది భవిష్యత్తు​అగాధంలో పడినట్టయిందన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే నిర్వహించిన గ్రూప్​ 1ను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్​ చేశారు.

ఈ మేరకు శుక్రవారం ఆమె సీఎం రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు. ప్రిలిమ్స్, మెయిన్స్​కు వేర్వేరు హాల్​టికెట్లు​ఇవ్వడం, మెయిన్స్​పరీక్షకు పది మంది ఎక్కువగా హాజరవడం, ఆన్సర్​ షీట్ల ఎవాల్యుయేషన్​పైనా అనేక సందేహాలున్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే, కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగిందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అభ్యర్థుల ఆందోళన న్యాయమైనదని భావించిన హైకోర్టు.. నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందని కవిత పేర్కొన్నారు. కాబట్టి, గ్రూప్​1 పరీక్షను మళ్లీ కొత్తగా నిర్వహించాలని ఆమె డిమాండ్​ చేశారు.