- బీసీ డెడికేటెడ్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చిత్తశుద్ధితో చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ వర్గాల్లో కులగణనపై అనేక అనుమానాలున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. సోమవారం ఆమె బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ సైదులును కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రిపోర్ట్ అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. సమాజంలో అన్ని కులాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. జరగాల్సిన న్యాయం మాత్రం జరగడంలేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉందని ఆమె తెలిపారు.
రాజ్యాంగపరమైన హక్కులు కల్పించలేదన్న భావన బీసీల్లో తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించడానికి 11 నెలల పాటు తాత్సారం చేసిందని విమర్శించారు. కేవలం నెల రోజుల్లోనే ఇంత పెద్ద అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఎలా సాధ్యమవుతుందని కవిత ప్రశ్నించారు.
డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ బీసీ నాయకులు గట్టు రాంచందర్ రావు, వి ప్రకాశ్, రవీందర్ సింగ్, జూలూరి గౌరీ శంకర్, పల్లె రవి కుమార్ గౌడ్, సుమిత్ర ఆనంద్, రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.