కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ 70 వేల కోట్ల రూపాయలు మింగిండు

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రూ.70,000 కోట్లు మింగిండని మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు బాధితులను సీఎం ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ కవిత పాత్ర ఉందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా తన కుటుంబం కోసమే పని చేస్తున్నాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి  5 లక్షల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడని అన్నారు. అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపించాలంటే రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నారని, కానీ కేసీఆర్ మాత్రం  ఇండ్ల నిర్మాణానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కే ధారపోసాడని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు కమిషన్ దోచుకున్నాడని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేకుండా నిలువునా మోసం చేశారని అన్నారు. ఢిల్లీలో కవితకు 800ల లిక్కర్ దుకాణాలున్నాయని వివేక్ ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ కు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిచ్చే సోయి లేదు కానీ ఆయనకు, కొడుకుకు, బిడ్డకు, అల్లునికి  ఒక్కో ఒక ఫామ్ హౌస్ లు మాత్రం కట్టించుకున్నారని ఫైర్ అయ్యారు.