తీహార్ జైల్లో కవిత ఆభరణాలు ధరించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను సీబీఐ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఇందులో కవిత పెట్టుకొన్న పలు విజ్ఞప్తులను కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఆమె పెట్టుకున్న ఆరు విజ్ఞప్తులను అంగీకరిస్తూ.. రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటి భోజనంతోపాటు పడుకొనేందుకు మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేశారు. వీటితోపాటు పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతించారు. అయితే, కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని జడ్జి ఆదేశించారు.
కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటి నాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు. లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్ లో కవిత న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రికార్డులను ‘కాన్ఫిడెన్షియల్’గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు కోర్టు సూచించింది..