- నీళ్ల మీద వాస్తవాలు చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో సోయిలేని పాలన నడుస్తున్నదని, రైతులకు నీళ్లు ఇవ్వకుండా వారి పొట్ట కొడ్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జలవనరులు, ప్రాజెక్టులపై ‘నీళ్లు -నిజాలు’ అనే అంశంపై తెలంగాణ జాగృతి సంస్థ శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
జాగృతి అధ్యక్షురాలు, కవితతో పాటు మేధావులు, విశ్రాంత ఇంజినీర్లు ఇందులో పాల్గొన్నారు. పలు తీర్మానాలు ఆమోదించి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కవిత మాట్లాడుతూ కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
‘‘తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా ముందుకెళ్లాం. కానీ, రేవంత్ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విస్మరిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించాం. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను మేము పూర్తిచేశాం. 2022-----–23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగింది.
అయినా.. పదేండ్లలో ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరం” అని కవిత పేర్కొన్నారు. వి.ప్రకాశ్ మాట్లాడుతూ కాళేశ్వరం మూడో టీఎంసీ చేపట్టకపోతే గోదావరి జలాల్లో మనం శాశ్వత వాటా కోల్పోతామని, అందుకే మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో మూడో టీఎంసీకి రూపకల్పన చేశారని అన్నారు.