
- ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చారు: కవిత
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముమ్మాటికీ ఎలక్షన్ గాంధీనే అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీలను, రాష్ట్ర సర్కార్ అకృత్యాలను ప్రశ్నిస్తే.. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తన కేసుల గురించి మాట్లాడే ముందు సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాహుల్‌కు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కాని.. వారి కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్‌సీయూలో చెట్లను నరికివేస్తున్నప్పుడు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినప్పుడు, లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై అకృత్యాలు సాగించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.