
అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
శంషాబాద్, వెలుగు: ఏపీకి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూతురు కావూరి శ్రీవాణిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై జైపూర్‌లో చీటింగ్ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన శ్రీవాణిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమెను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై జైపూర్‌కు తీసుకెళ్లారు. దీనికి ముందు శ్రీవాణి మీడియాతో మాట్లాడారు. తమ కంపెనీకి సంబంధించిన లావాదేవీల విషయంలో ఎవరినీ మోసం చేయలేదన్నారు. కంపెనీ పూర్తిగా దెబ్బతిన్నా.. బ్యాంకులకు కట్టాల్సిన లోన్లు మొత్తం క్లియర్ చేశామన్నారు. తాను కంపెనీని నుంచి బయటికొచ్చి 8 ఏండ్లు అవుతున్నా.. కొందరు కావాలనే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.