స్టార్టప్​ : సేంద్రియ భూమిగా మార్చడమే లక్ష్యం!

నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కావ్యని కరోనా రైతుగా మార్చేసింది. ఆమె కరోనా టైంలో చాలా ధైర్యంగా సర్వీస్​ చేసి.. ఎంతోమంది ప్రాణాలను కాపాడింది.  అదే టైంలో ఆమె ఆర్గానిక్​ ఫుడ్​ గురించి తెలుసుకుంది. కెమికల్స్​ లేని ఫుడ్​ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని, దానివల్ల కరోనా లాంటి విపత్తుల నుంచి తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించింది. 

వెంటనే జాబ్​కి రిజైన్​ చేసి.. ఆర్గానిక్​  ఫార్మింగ్​ చేయడం మొదలుపెట్టింది. అప్పటినుంచి మనుషులతో పాటు భూమి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది కావ్య. అందుకోసం ప్రత్యేకంగా ఒక స్టార్టప్​ పెట్టి దాని ద్వారా వర్మీ కంపోస్ట్‌‌ తయారుచేస్తోంది. రైతులకు ట్రైనింగ్​ కూడా ఇస్తోంది. 

ముంబైకి చెందిన కావ్య ధోబలే ఏదోవిధంగా ప్రజలకు సేవ చేయాలి అనుకునేది. అందుకే 2017లో ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ అండ్​ మెడికల్ కాలేజీలో  నర్సింగ్‌‌లో డిప్లొమా పూర్తి చేసింది. ఆ తర్వాత టాటా హాస్పిటల్‌‌లో స్టాఫ్ నర్స్‌‌గా చేరి, క్యాన్సర్ పేషెంట్లకు సర్వీస్​ చేసింది. 2019లో సియోన్ హాస్పిటల్‌‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.  

కరోనా టైంలో.. 

కావ్య కరోనా టైంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసింది. చాలా రోజుల పాటు ఇంటికి వెళ్లలేదు. అంత చేసినా.. తను చూసుకునే రోగుల్లో కొందరు చనిపోయారు. కొందరిలో అకస్మాత్తుగా ఎస్పీఓ2(ఆక్సిజన్ శాచురేషన్​) పడిపోయేది. దానివల్ల హార్ట్‌‌ రేట్​, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వచ్చేవి. ఆరు నెలలు హాస్పిటల్​లోనే ఉండి పనిచేసిన కావ్య పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత ఇంటికి వెళ్లింది. ఆ వెంటనే ఆమెకు కూడా కరోనా వచ్చింది. ఆరోగ్యం బాగా క్షీణించింది. 

ఇలా కరోనా టైంలో తనకు ఎదురైన అనుభవాలే ఆమెకు ఆరోగ్య పాఠాలు నేర్పాయి. “ఇప్పుడు ఎంతోమంది షుగర్​, బీపీ, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురవుతున్నారు. అలాంటివాళ్లలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కరోనా లాంటివి వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయగలం అని ఆలోచించా. 

చివరకు మనం తినే తిండిలో ఉండే రసాయన అవశేషాలే చాలావరకు రోగనిరోధక శక్తి తగ్గేలా చేస్తాయని తెలుసుకున్నా. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు సర్వీస్​ చేయడానికి బదులు అట్టడుగు స్థాయి నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్‌‌లను తట్టుకునేవిధంగా ప్రజల ఇమ్యూనిటీని పెంచే.. సేంద్రియ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని డిసైడ్​ అయ్యా​” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చింది కావ్య.  

ఇంట్లో చెప్తే  

ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తానంటే ఎవరైనా వద్దనే అంటారు. కావ్య అత్తా–మామలు కూడా అదే అన్నారు. కానీ.. ఆమె మాత్రం ఎవరు చెప్పినా వినకుండా 2022లో జాబ్​కి రిజై‌‌‌‌న్​ చేసి.. మట్టికి తిరిగి ఆరోగ్యాన్ని తీసుకురావాలనే కృత నిశ్చయంతో వర్మీ కంపోస్టింగ్ గురించి తెలుసుకుంది. ఆ తర్వాత సొంతూరికి వెళ్లి పట్టుదలతో సాగు మొదలుపెట్టింది. “నేను ఊరికి వచ్చాక చాలామంది రైతులను కలిశా. వాళ్లంతా విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారని అర్థమైంది. వాళ్ల పొలాల్లో అసలు వానపాములే కనిపించలేదు” అంటూ చెప్పుకొచ్చింది కావ్య. అప్పుడే కావ్య తాను మాత్రమే ఆర్గానిక్​ ఫార్మింగ్ చేస్తే.. సరిపోదని, తనతోపాటు రైతులందరినీ తన మార్గంలో నడిచేలాచేయాలని నిర్ణయించుకుంది. 

చెట్ల కోసం..

లాభాపేక్ష లేకుండా బంజరు భూముల్లో చెట్లు పెంచే ఖుషాల్ సింగ్ కూడా కావ్య దగ్గర ట్రైనింగ్​ తీసుకున్నాడు. ‘‘మేము మొక్కలను వేయడానికి మార్కెట్ నుండి వర్మీ కంపోస్ట్ కొనేవాళ్లం. అందుకు  చాలా ఖర్చయ్యేది. దాంతో కావ్య దగ్గర కంపోస్ట్‌‌ను తయారు చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగా తయారుచేసుకోవడం వల్ల చాలా ఖర్చు తగ్గించుకోగలిగా. నేను తయారుచేసే కంపోస్ట్‌‌లో కొంత స్థానిక రైతులకు కూడా అమ్ముతున్నా” అన్నాడు ఖుషాల్​ సింగ్​. 

వర్మీ కంపోస్ట్‌‌ తయారీ

సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ తెలిసేలే చేయాలంటే.. వర్మీ కంపోస్ట్‌‌ తయారు చేసి, రైతులు వాడేలా చేయాలి. అందుకోసం కావ్య వర్మీ కంపోస్ట్ బెడ్‌‌ల కోసం ఒక చిన్న షెడ్‌‌ను కట్టించింది. అందులో 5 లక్షల పెట్టుబడితో 0.2 ఎకరాల స్థలంలో 10 బెడ్‌‌లను ఏర్పాటు చేసుకుంది. ఆరు నెలల్లో ఆ సంఖ్యను 20కి పెంచింది. ఆవు పేడను ఉపయోగించి వర్మీ కంపోస్ట్‌‌ను రెడీ చేయడానికి సుమారు 60 రోజులు పట్టింది. ఆ ఎరువులు వాడిన రైతులకు మంచి లాభాలు వచ్చాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కావ్య దగ్గర వర్మీ కంపోస్ట్‌‌ని కొనడం మొదలుపెట్టారు. 

ఇప్పుడు కావ్య ప్రతినెలా సుమారు 20 టన్నుల వర్మీకంపోస్ట్‌‌ను తయారు చేస్తోంది. దాన్ని మహారాష్ట్ర అంతటా సరఫరా చేస్తోంది. 50 కిలోల బ్యాగ్​ని రూ. 500 కు అమ్ముతోంది. అలా.. భూమికి మేలు చేయడంతోపాటు ఏటా రూ. 30 లక్షల వరకు సంపాదిస్తోంది. 

ట్రైనింగ్​ సెంటర్​ ఏర్పాటు

వర్మీ కంపోస్ట్‌‌ తయారుచేసి అమ్మడమే కాదు.. దాన్ని ఎలా తయారుచేసుకోవాలో రైతులకు నేర్పడమే లక్ష్యంగా పనిచేస్తోంది కావ్య. ఎక్కువమంది రైతులను సేంద్రియ సాగు వైపు నడిపించేందుకు ‘కృషి కావ్య అగ్రో వర్మీకంపోస్ట్ ట్రైనింగ్​ సెంటర్’​ని పెట్టింది. అందులో పది మంది పనిచేస్తున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన  3,000 పైగా రైతులకు ట్రైనింగ్​ ఇచ్చింది. 

ఒకరోజు ట్రైనింగ్​కు రూ. 1,500 చార్జ్​ చేస్తున్నారు. ‘లాభాల కోసం కాకుండా సాగు పద్ధతుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. నా ప్రయాణంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తా. ప్రతి రైతు ట్రైనింగ్ తీసుకుని, ప్రతి పొలంలో సేంద్రియ సాగు చేసినప్పుడే మనం మట్టిని కాపాడుకోగలం” అంటోంది కావ్య.