ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

  • ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
  • కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్

నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, వాటి రాక పట్ల సంబంధిత అధికారులు అలర్ట్ గా ఉండాలని కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ అన్నారు. ఏనుగులతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మేనేజింగ్ హ్యూమన్- ఎలిఫెంట్ కన్​ఫ్లిక్ట్ అంశంపై మంగళవారం టైగర్ జోన్ పరిధిలోని ఫారెస్ట్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, యానిమల్ హస్బెండరీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో మంచిర్యాల కలెక్టరేట్​లో వర్క్ షాప్ నిర్వహించారు.

దాదాపు 300 ఏనుగులు ఛత్తీస్​గఢ్​లో నివాసం ఉంటున్నాయని, అవి గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఓ మగ ఏనుగు మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి, పెంచికలపేట్ మండలాల్లో సంచరిస్తూ ఇద్దరు రైతులను చంపిన విషయం తెలిసిందే. ఏనుగులు మళ్లీ ఇటువైపు వచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

స్థానిక ప్రజాప్రతినిధలు అలర్ట్​గా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ సంతోష్​ సూచించారు. అటవీ సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. డ్రోన్​లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను గుర్తించి ఎప్పటికప్పుడు ట్రాకింగ్ సెల్​కు రిపోర్ట్ పంపాలన్నారు.

ఏనుగుల సంచారం పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ స్పెషలిస్ట్ డాక్టర్ నవనీతన్ అవగాహన కల్పించారు. వర్క్​షాప్ లో మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ఫారెస్ట్ అధికారులు శివ్ అశిష్ సింగ్, నీరజ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.