- వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా రూల్స్ కఠినంగా అమలు
- రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్‌కు బ్రేక్
- లోకల్ వెహికల్స్, బస్సులు, అంబులెన్స్‌లకు మాత్రమే పర్మిషన్
- పగటిపూట వాహనాలకు ఎన్విరాన్మెంటల్ సెస్ వసూలు
మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్లో రాత్రిపూట వాహనాల రాకపోకలపై అటవీశాఖ ఆంక్షలు విధించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వాహనాలను నిషేధించింది. లోకల్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కవ్వాల్ ఫారెస్టు పరిధిలోని గ్రామాల ప్రజలు చెక్‌పోస్టుల దగ్గర ఆధార్‌కార్డులు చూపితే వారి వాహనాలను అనుమతిస్తారు.
మిగతా వెహికల్స్‌ను ఆయా రూట్లలోఉన్న చెక్‌పోస్టుల దగ్గరే ఆపివేస్తారు. ఈ రూల్స్‌ను గురువారం రాత్రి నుంచి స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నట్టు జన్నారం, ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్‌లు(ఎఫ్ఆర్వోలు) వి.సుష్మారావు, కే.శ్రీనివాస్ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు.
వన్యప్రాణుల రక్షణ కోసం
కవ్వాల్ టైగర్ జోన్ వివిధ రకాల వన్యప్రాణులకు ఆవాసంగా మారింది. ఈ ఫారెస్టు నుంచే మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ ప్రధాన రోడ్లు ఉన్నాయి. ఈ రూట్లలో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండడంతో రాత్రిపూట వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారింది. ఓవర్స్పీడ్వల్ల అటవీ జంతువులు యాక్సిడెంట్లలో చనిపోతున్నాయి. మరోవైపు రాత్రిపూట వన్యప్రాణులను వేటాడుతున్న ఘటనలూ బయటపడుతున్నాయి.
ఈక్రమంలో రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు (ఎస్బీడబ్ల్యూఎల్) రాత్రి సమయంలో వెహికల్స్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. గతంలోనూ రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ లోకల్ వెహికల్స్‌పై నిషేధం ఉండేది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఆంక్షలు సడలించారు. వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా మళ్లీ పునరుద్ధరించినట్టు ఆఫీసర్లు పేర్కొన్నారు.
రాయపట్నం మీదుగా ప్రత్నామ్నాయ రూట్
నైట్9 నుంచి మార్నింగ్ 6 గంటల మధ్య అత్యవసరమైన వాహనాదారులు రాయపట్నం మీదుగా ప్రత్యామ్నాయ రూట్లో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌వైపు వెళ్లాల్సి ఉంటుంది. మంచిర్యాల నుంచి వెళ్లే వెహికల్స్‌ను దండేపల్లిలోని ముత్యంపేట, జన్నారం మండలం తపాల్పూర్ చెక్‌పోస్టుల వద్ద నిలిపివేస్తారు. నిర్మల్ నుంచి వచ్చేవాటిని కడెం మండలం పాండ్వాపూర్ చెక్‌పోస్టు దగ్గర, ఆదిలాబాద్‌నుంచి వచ్చే వెహికల్స్‌ను ఉట్నూర్ మండలం బీర్సాయిపేట చెక్‌పోస్టులో ఆపేస్తారు. ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా అనుమతిస్తారు.
పర్యావరణ సెస్ వసూలు
కవ్వాల్ టైగర్ జోన్ మీదుగా పగటిపూట వెళ్లే నాన్‌లోకల్ వెహికల్స్‌కు ఎన్విరాన్మెంటల్ సెస్ వసూలు చేస్తున్నారు. నాలుగు టైర్ల వాహనానికి రూ.50, ఆరు టైర్లకు రూ.150, అంతకంటే ఎక్కువ టైర్ల వాహనాలకు రూ.600 వసూలు చేస్తున్నారు. పగలు కూడా హెవీ వెహికల్స్ రాకపోకలపై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని రకాల వాహనాల స్పీడ్ లిమిట్ గంటకు 30 కిలోమీటర్లు మించరాదనే రూల్స్అమల్లో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.