ఎకో టూరిజం.. ఎందుకింత జాప్యం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో పూర్తవని పనులు

ఎకో టూరిజం.. ఎందుకింత జాప్యం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో పూర్తవని పనులు
  • కాటేజీలు నిర్మించలే.. సఫారీ వాహనాలు లేవు
  • గైడ్​ల నియామకంపై స్పష్టత కరువు

నిర్మల్, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని కొంత ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు గతంలో అటవీ శాఖ రూపొందించిన ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. టైగర్ జోన్  పరిధిలోని నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మొత్తం 78వేల హెక్టార్ల నుంచి 20 శాతం మేర కోర్, బఫర్ ఏరియాల్లో టూరిజం ఏర్పాటు చేయాలని భావించారు. డీసీఎఫ్ కమిటీ నిర్ణయం మేరకు సదరు ప్రాంతాన్ని కూడా ఎంపిక చేశారు. ఇందులో అటవీ ప్రాంతంతోపాటు సుందర ప్రదేశాలు, గడ్డి మైదానాలు, వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. 

అడవిలో టూరిస్టులు సందర్శించేందుకు అనుకూలమైన ప్రదేశాలకు సంబంధించి ప్రత్యేక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. అలాగే, కవ్వాల్ టైగర్ జోన్ ను చూసేందుకు  ప్రత్యేకంగా సఫారీ వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మొత్తం 5 సఫారీ వాహనాలను సమకూర్చేందుకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించారు. ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ టూరిజం స్పాట్ నిర్వహణను పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కింద చేపట్టాలని అటవీశాఖ ప్రతిపాదించింది. 

మొత్తం 7 గ్రామాలు..

కవ్వాల్ పరిధిలోని 7 గ్రామాలైన  కడెం, గంగాపూర్, ఎక్బాల్ పూర్, ఉడుంపూర్, కల్వకుంట్ల, ఆకోండపేట, గంగాపూర్ లను టూరిజం స్పాట్ పరిధిలోకి చేర్చారు. టూరిస్టుల వసతి కోసం దిమ్మదుర్థి వద్ద 12, జన్నారం వద్ద 10 చొప్పున కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించారు. కడెం ప్రాజెక్టు సమీపంలో దాదాపు 550 మీటర్ల ఎత్తున గల గుట్టపై ఇప్పటికే వాచ్ టవర్ నిర్మించారు.

 అటవీ శాఖ 50 ఎకరాల్లో అందమైన గడ్డి మైదానాలు పెంచగా వాటిని టూరిజం స్పాట్ లో చేర్చారు. కవ్వాల్ టైగర్ జోన్ విశేషాలను తెలిపేందుకు ప్రత్యేకంగా గైడ్ లను నియమించేందుకు ప్రతిపాదనలు చేశారు. పైన పేర్కొన్న గ్రామాలను కలుపుతూ టూరిస్టుల కోసం రోడ్డు నిర్మించారు. దట్టమైన అడవిలోని ప్రకృతి సౌందర్యంతోపాటు నీటి కొలనులు, చిన్న చిన్న జలపాతాలు, మృగాలు టూరిస్టులను ఆకర్షించనున్నాయని అధికారులు చెబుతున్నారు.

పీపీపీ, కాటేజీలపై స్పష్టత ఏదీ?

ఏకో టూరిజం నిర్వహణ పీపీపీ విధానంలో చేపట్టాలనుకున్నా ఇప్పటివరకు దీనిపై స్పష్టత లేదు. కాటేజీలు నిర్మించలేదు. అటవీ శాఖకు సంబంధించిన ఒక సఫారీ వాహనం తప్ప టూరిజం కింద కొనుగోలు చేసినవి లేవు. గైడ్​లుగా స్థానిక యువతనే నియమిస్తారన్న చర్చ జరిగినా ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఆర్చి నిర్మించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకో టూరిజం స్పాట్ కు సంబంధించి కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిధులు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టూరిజంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన నేపథ్యంలో కవ్వాల్ టూరిజం స్పాట్ వద్ద అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.