
కాజీపేట, వెలుగు: కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని వివిధ పార్టీల నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. ఓరుగల్లు లీడర్లు శ్రద్ధ చూపకపోవడం వల్లే కాజీపేటకు సాంక్షన్ అయిన కోచ్ ఫ్యాక్టరీని పోగొట్టుకున్నామని చెప్పారు. కాజీపేటలోని రైల్వే ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, కోచ్‌ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటం చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో ఇదివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రైవేటు కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, దీంతో కేంద్రం మరో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం అనుమానమేనన్నారు.
ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న పీవోహెచ్, వ్యాగన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లను తాము స్వాగతిస్తున్నామని, వాటి ద్వారా ఐదారు వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కానీ, కొంతమంది పీవోహెచ్, వ్యాగన్ పరిశ్రమలతో ఉద్యోగాలు రావని భయాందోళనకు గురిచేస్తున్నారని, అపోహలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమల ఏర్పాటుకు 150 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని, మిగతా 10.17 ఎకరాలు కూడా ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని చెప్పారు. కాజీపేటకు వచ్చిన పీవోహెచ్, వ్యాగన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను ఎవరూ తప్పు పట్టొద్దని, వాటితో పాటు కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా సాధించడానికి నాయకులు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ చైర్మన్ కొండ్రా నర్సింగారావు, నాయకులు పాక వేద ప్రకాశ్, అనుమల శ్రీనివాస్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.