
- 160 ఎకరాలకు 150 ఎకరాలు మాత్రమే అప్పగించిన రాష్ట్ర సర్కార్
- మరో 10 ఎకరాలపై ఏడాదిన్నరగా కిరికిరి
- ల్యాండ్ ఇవ్వాలని గతంలోనే లెటర్లు రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ఈమధ్యే రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
- స్థలం ఇచ్చామంటున్న బీఆర్ఎస్ నేతలు
- వాదనలు తప్ప.. ముందుకు సాగని ప్రాజెక్టు
హనుమకొండ, వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలక జంక్షన్ కాజీపేటకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్(పీవోహెచ్)కు కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన జాగ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కిరికిరి పెడుతుండటంతో పీవోహెచ్‌కు పునాది పడడం లేదు. దాదాపు ఐదారు వేల మంది యూత్‌కు ఉపాధి కల్పించే ప్రాజెక్టు కావడం, పీవోహెచ్ తర్వాత వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైల్వే జేఏసీ లీడర్లు పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేస్తున్నారు. కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా స్థలం ఇచ్చామని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకుంటుండగా.. పీవోహెచ్‌కు అవసరమైన స్థలం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లను బీజేపీ వైరల్ చేస్తోంది. దీంతో ఇరువర్గాల వాదనలు తప్ప ప్రాజెక్టుకు అడుగులు పడకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
160 ఎకరాల్లో.. రూ.383 కోట్ల ప్రాజెక్ట్
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేయాలనే డిమాండ్ దశాబ్దాల నుంచి ఉంది. 1982లో అప్పటి కాంగ్రెస్ సర్కారు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించినా.. వివిధ రాజకీయ కారణాలతో అది కాస్త పంజాబ్ లోని కపుర్తలాకు తరలిపోయింది. ఆ తర్వాత 2007లో వ్యాగన్ వీల్ వర్క్ షాప్ శాంక్షన్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం టైమ్‌కు జాగ ఇవ్వకపోవడంతో అది కర్నాటకలో ఏర్పాటు చేశారు. ఇక్కడికి శాంక్షన్ అయిన రెండు మేజర్ ప్రాజెక్టులు చేజారగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్ల ఖర్చుతో కాజీపేటకు ‘పీరియాడికల్ ఓవర్ హాలింగ్’(పీవోహెచ్) వర్క్‌షాపు మంజూరు చేసింది. వర్క్ షాపు ఏర్పాటుకు అవసరమైన 160 ఎకరాలను రైల్వే శాఖకు హ్యాండోవర్ చేయాల్సిందిగా కోరింది. దీంతో గతంలో కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ వీల్ తయారీ ప్రాజెక్టులకు ప్రపోజల్స్ చేసి మడికొండ రామలింగేశ్వరస్వామి ఆలయ భూములను పీవోహెచ్ ఏర్పాటుకు పరిశీలించారు. అవన్నీ ఎండోమెంట్ భూములు కాగా.. ఆ స్థలాన్ని సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారం ఇచ్చి దాదాపు 150.5 ఎకరాలను ఎండోమెంట్ నుంచి రైల్వే శాఖకు మ్యూటేషన్ చేసి 2021 జనవరి 6న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా రైల్వే ఆఫీసర్లకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మిగతా పది ఎకరాలు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.
10 ఎకరాలు ఇస్తలేరు..
పీవోహెచ్ వర్క్ షాపు కోసం నాలుగైదు నెలల కిందట రైల్వే శాఖ టెండర్లు కూడా పిలించింది. దీంతో హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ టెండర్ దక్కించుకోగా.. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇదివరకు ఇచ్చిన 150 ఎకరాలకు ఇంకో 10 ఎకరాలు సేకరించి ఇవ్వాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. 2021 అక్టోబర్ లో అక్కడి రైతుల నుంచి మరో 9.03 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం రైల్వేశాఖకు మ్యూటేషన్ చేయకుండా ఆపేసింది. దానికి తోడు ప్రాజెక్టుకు వెళ్లే ప్రవేశ మార్గంలో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన 1.17 ఎకరాల ల్యాండ్ ఉండగా.. దాన్ని సేకరించాల్సి ఉంది. కానీ ఈ మొత్తం ల్యాండ్ ను రైల్వేశాఖకు అప్పగించడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడు నెలల కిందట భూమి అప్పగిస్తామని చెప్పడంతో రైల్వే ఆఫీసర్లు ప్రతిపాదిత స్థలాన్ని చదును చేసి, సాయిల్ టెస్ట్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత ల్యాండ్ అప్పగింతలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆ స్థలంలో పిచ్చిచెట్లు పెరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల పీవోహెచ్ సాధన కోసం ధర్మ పోరాటదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
కోచ్ ఫ్యాక్టరీకి ఎన్నివేల ఎకరాలైనా ఇస్తం..
కాజీపేటలో రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇటీవల 49, 50 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇదిలాఉంటే తాము పీవోహెచ్ అడగలేదని, కోచ్ ఫ్యాక్టరీకి ఎన్నివేల ఎకరాలైనా ఇస్తామని ఏప్రిల్ 29న భారత్ ఆత్మగౌరవ్ ట్రైన్ ఓపెనింగ్ టైమ్‌లో చెప్పారు. పీవోహెచ్‌కు అవసరమైన 10 ఎకరాల స్థలం ఇవ్వకుండా.. కోచ్ ఫ్యాక్టరీకి ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తామనడమేంటని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఎవరి మాట వాళ్లదే..
పీవోహెచ్ పనులు స్టార్ట్ అయిన తర్వాత వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభించేందుకు కేంద్రం రెడీగా ఉంది. ఈ ప్రాజెక్టుకు రూ.581 కోట్ల వరకు ఫండ్స్ కేటాయించింది. కానీ పీవోహెచ్ ఏర్పాటు విషయమై ఇక్కడి అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ తలోమాట చెప్తున్నాయి. ఇరుపార్టీల వాదనలతోనే కాలం గడుస్తోంది తప్ప ప్రాజెక్టు ఏర్పాటుకు మాత్రం అడుగులు పడడం లేదు.
యువతకు ఉపాధి చూపాలి..
పీవోహెచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు అప్పగిస్తే పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభమైతే ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థలం అప్పగించేందుకు చొరవ చూపాలి. - దేవులపల్లి రాఘవేందర్, కన్వీనర్, తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ