- వరంగల్‌లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద
- రంగనాయక సాగర్ కాల్వకు గండి
హైదరాబాద్/కాజీపేట/నెట్వర్క్, వెలుగు : రాష్ట్రంలో పలు చోట్ల మంగళవారం రాత్రి, బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నల్గొండ, హైదరాబాద్, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జనగామ జిల్లాల్లో వానలు పడ్డాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చాలాచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీళ్లు చేరగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాజీపేట రైల్వే స్టేషన్ లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
రైల్వే ప్లాట్ ఫాం, టికెట్ బుకింగ్, ఎంక్వయిరీ కౌంటర్లతో పాటు స్టేషన్ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. స్టేషన్ లో నీళ్లు దాదాపుగా రెండు గంటల తర్వాత తగ్గుముఖం పట్టాయి. వరంగల్ చౌరస్తాలోని షాపుల్లోకి కూడా వరద నీళ్లు చేరాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వాన దంచి కొట్టింది. సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం పడింది.
చేర్యాల నుంచి సిద్దిపేట వెళ్లే దారిలో తాడూర్ క్రాస్ వద్ద రోడ్డు తెగి.. రాకపోకలు నిలిచిపోయాయి. కొమురవెల్లి మండలం చిట్యాల క్రాసింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. కమలాయపల్లిలో రంగనాయక సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు గండి పడటంతో నాట్లేసిన పొలాలు మునిగాయి. మెదక్ పట్టణంలో కుండపోతతో సాయినగర్ కాలనీ జలమయమైంది. ఖమ్మంలోనూ బుధవారం సాయంత్రం భారీ వర్షం పడింది.
మరో రెండ్రోజులు..
రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా గంగారంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా రేగొండలో 5.7, జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో 5.5, భద్రాద్రి జిల్లా అంకంపాలెంలో 5.2, సుజాతానగర్‌లో 3.6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 3.2, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 3.1, మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 3, ఆదిలాబాద్జిల్లా రామ్‌నగర్‌లో 2.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు చోట్ల మరో రెండు రోజుల పాటు మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని తెలిపింది. కాగా, జూన్ నెలలో లోటు వర్షపాతమే నమోదైంది. మొత్తంగా129.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 44 శాతం లోటుతో 72.6 మిల్లీమీటర్ల వర్షపాతమే రికార్డయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.