కాజీపేట టు బల్లార్షా ట్రైన్​ పునరుద్ధరణ : ఎంపీ వంశీకృష్ణ

కాజీపేట టు బల్లార్షా ట్రైన్​ పునరుద్ధరణ : ఎంపీ వంశీకృష్ణ
  • ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వెంకటస్వామి కృషి ఫలితం 
  • పలుసార్లు రైల్వే శాఖ మంత్రి దృష్టికి సమస్య
  • ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ

కాజీపేట, వెలుగు:  కాజీపేట రైల్వే జంక్షన్​ నుంచి బల్లార్షా (17035),  బల్లార్షా నుంచి కాజీపేట (17036) ఎక్స్ ప్రెస్  రైలు సేవలను ఎట్టకేలకు తిరిగి ప్రారంభించారు.  కొంతకాలంగా ఈ ట్రైన్ సేవలు నిలిచిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ముఖ్యంగా స్టూడెంట్లు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో విషయాన్ని పెద్దపెల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతోనూ చర్చలు జరిపారు. 

వారి ప్రత్యేక చొరవతో కాజీపేట టు బల్లార్షా , బల్లార్షా టు కాజీపేట ఎక్స్ ప్రెస్  సేవలను పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ బుధవారం ఉత్తర్వుల జారీచేసింది. రైలు సమయం, స్టాపేజీ ల విషయంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. రైలు పునరుద్ధరణతో ఈ మార్గంలోని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట టు బల్లార్షా, బల్లార్షా టు కాజీపేట ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరించడంతో ముఖ్యంగా కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్  ప్రయాణికులకు కనెక్టవిటీ పెరుగనుంది. అంతేగాకుండా పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపారాల పెరుగదలకు తోడ్పడనుంది. రైల్వే మౌళిక సదుపాయాల అభివృద్ధి, స్టేషన్ అప్ గ్రేడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగవడంతో పాటు ఆధునిక  కోచ్ లు, ముఖ్యమైన స్టాపేజీలు పెరిగే అవకాశం  ఉంది.

మెరుగైన రవాణా సదుపాయాల కోసం కృషి: ఎంపీ వంశీకృష్ణ

ప్రజలకు ఎంతో అవసరమైన కాజీపేట టు బల్లార్షా రైలును పునరుద్ధరించడం సంతోషంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని,   కాజీపేట టు బల్లార్షా మార్గంలో రైలు సేవలను పునరుద్ధరించేందుకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో మెరుగైన రైల్వే రవాణా సదుపాయాల కోసం తన ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.