- నెరవేరనున్న ఏండ్లనాటి కల
- గతంలో ఎన్నికల హామీగా బస్టాండ్
- కాజీపేట రైల్వే జంక్షన్ భూములు కేటాయించాలన్న కాంగ్రెస్ లీడర్లు
- స్పందించిన సౌత్ ఇండియా రైల్వే శాఖ ఉన్నతాధికారులు
- కాజీపేట రైల్వే స్కూల్ భూములు పరిశీలించిన ఆఫీసర్లు, ఎంపీ, ఎమ్మెల్యే
వరంగల్, వెలుగు: ఏండ్ల నాటి కల నెరవేరనున్నది. కాజీపేట సిటీలో బస్టాండ్ నిర్మాణానికి ఏప్రిల్‍లో శంకుస్థాపన చేసేందుకు అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 45 ఏండ్లుగా రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగానే మిగిలిపోయిన బస్టాండ్ కల ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రభుత్వంతో సహకారం కానున్నది. ఇందుకోసం ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న నేతలు బస్టాండ్ నిర్మాణాన్ని సీరియస్‍గా తీసుకోవడంతో రైల్వే శాఖ అధికారులు స్పందించారు. ఇప్పటికే కాజీపేట రైల్వే స్కూల్ భూముల పరిశీలన చేశారు.
ట్రైసిటీలో ఉన్నా, కాజీపేటలో బస్టాండ్ లేదు..
గ్రేటర్ వరంగల్ సిటీ పరిధిలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలను ట్రైసిటీగా పిలుస్తున్నారు. ఏడు కిలోమీటర్ల దూరంతో ఉండే ఈ మూడు సిటీల్లోని కాజీపేటలో మాత్రం బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓరుగల్లు నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా, ఢిల్లీ మొదలు చెన్నై వరకు నగరానికి జనాలు రావాలన్నా కాజీపేట రైల్వే జంక్షన్ సెంటర్‍గా ఉంది.
అయినా ఇప్పటికీ కాజీపేటలో బస్టాండ్ నిర్మాణం అమలుకు నోచుకోలేదు. ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు చేయాలని దాదాపు 45 ఏండ్లుగా రైల్వే, పోస్టల్ యూనియన్ నేతలు, స్థానికులు ఉద్యమాలు కూడా చేశారు. దివంగత మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్, ఆయన సోదరుడు దాస్యం వినయ్ భాస్కర్సైతం కాజీపేట బస్టాండ్ నినాదంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టి, ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో పని చేశారు. కానీ, కాజీపేట బస్టాండ్ నినాదంతో వచ్చిన దాస్యం బ్రదర్స్ బస్టాండ్ ఏర్పాటులో ఫెయిలయ్యారు.
ప్రత్యేక చొరవతో అడుగులు..
2003 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, ఎంపీ కడియం కావ్య కాజీపేట బస్టాండ్ సమస్య పై సీఎం రేవంత్‍రెడ్డి, రైల్వే అధికారులను కలిసి వివరించారు. గత ఎల 28న ఎమ్మెల్యే నాయిని ఆధ్వర్యంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే జీఎంను కలిశారు. బస్టాండ్ ఏర్పాటుకు అవసరమైన రైల్వే శాఖ భూములను అప్పగించాలని కోరారు.
దీంతో ఆ మరుసటి రోజే రైల్వే ఏడీఆర్‍ఎం గోపాల్‍తో కూడిన బృందం కాజీపేట జంక్షన్ ఏరియాకు పరిశీలనకు వచ్చారు. రైల్వే శాఖకు చెందిన మూడు భూములను ఆఫీసర్లతో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డును ఆనుకుని ప్రస్తుతం అందుబాటులో లేని రైల్వే ఇంగ్లిష్ స్కూల్‍కు చెందిన ఎకరంన్నర స్థలంలో కాజీపేట సిటీ బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
ఏప్రిల్‍లో పనులకు శంకుస్థాపన
కాజీపేట బస్టాండ్ కోసం 45 ఏండ్లుగా పోరాటాలు చేస్తున్రు. మేం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్‍రెడ్డి సహకారంతో రైల్వే అధికారులను ఒప్పించే ప్రయత్నం చేశాం. ఏప్రిల్ నెలలోనే కాజీపేట జనాల చిరకాల వాంఛగా ఉన్న కాజీపేట బస్టాండ్‍కు సీఎం రేవంత్‍రెడ్డి శంకుస్థాపన చేస్తారు. - వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి