కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధికి పాలన అనుమతులు

కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధికి పాలన అనుమతులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ బంజారాహిల్స్‌‌లోని కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి) పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ, అండర్ పాసులు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. పార్క్‌‌ చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను నిర్మించనున్నారు. పార్క్ ఎంట్రన్స్ నుంచి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం హాస్పిటల్‌‌ వైపు అండర్ పాసులు, ఫ్లై ఓవర్ల నిర్మించనున్నారు. 

హెచ్‌‌–- సీఐటీఐ (హైదరాబాద్‌‌- సిటీ ఇన్నోవేటివ్‌‌ అండ్‌‌ ట్రాన్స్‌‌ఫార్మేటివ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌)లో భాగంగా రెండు ప్యాకేజీలుగా ఈ జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది. ఇందులో మొదటి ప్యాకేజీ కింద రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్ పాస్‌‌లను నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజీలో నాలుగు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో నాలుగు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్‌‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌‌గూడ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తొలగనున్నాయి.