
- కులగణన, బీసీ రిజర్వేషన్లను ప్రస్తావించాలని సూచన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి విషయాలను సమయం దొరికినప్పుడు పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు.
తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చరిత్రాత్మక నిర్ణయాలను దేశవ్యాప్తంగా తీసుకుపోవచ్చని వివరించారు. గురువారం ఢిల్లీ సంవిధాన్ భవన్ (ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్)లోని ఆఫీసులో కేసీ వేణుగోపాల్‌ను రాష్ట్ర ఎంపీల కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ షట్కర్, రఘురాం రెడ్డి, బలరాం నాయక్, కావ్య పాల్గొన్నారు.
దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీ వేణుగోపాల్‌కు ఎంపీలు వివరించారు. బడ్జెట్‌లో బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలకు, ఇతర వర్గాలకు పెద్దపీట వేసినట్టు తెలిపారు. కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై చర్చించారు.
ప్రధానితో ఆల్ పార్టీ మీటింగ్‌పై చర్చ..
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన బిల్లులుపై కేసీ వేణుగోపాల్‌తో ఎంపీలు చర్చించారు. ఈ బిల్లులు అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందాయని.. కేంద్రాన్ని కూడా ఒప్పించేలా ఆల్ పార్టీ నేతలతో ప్రధానిని కలిసే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమిలోని ఎంపీలను మద్దతు కోరే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది.
ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరినట్టు సమాచారం. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 28 పెండింగ్ అంశాల సాధనకై త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ కోరనున్నట్టు కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, త్వరలో మరోసారి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్టు ఎంపీ మల్లు రవి మీడియాకు వెల్లడించారు.