సమన్వయంతో ముందుకెళ్లండి.. తెలంగాణ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం

సమన్వయంతో ముందుకెళ్లండి.. తెలంగాణ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచించారు. గురువారం హైదరాబాద్‎లో ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా లోధి రోడ్‎లోని కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 9:25 గంటలకు ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 

తొలుత 20 నిమిషాల పాటు కులగణనపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులగణన నివేదికను కేసీ వేణుగోపాల్‎కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన బాగుందని అభినందించారు. ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ కులగణన అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. ఈ సర్వేను ఉదాహరణగా చూపించి..  దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. 

సీఎంతో రెండు గంటలు చర్చ.. 

సీఎం రేవంత్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు సీఎం, పీసీసీ చీఫ్ ఎమ్మెల్యేల సమస్యలు అడిగి తెలుసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని, దాని వల్ల ప్రభుత్వంతో పాటు పార్టీకి నష్టమని ఆయన చెప్పారు. 
 

త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఏకగ్రీవంగా సర్పంచ్‎లను గెలిపించుకోవచ్చని చెప్పినట్టు తెలిసింది. కాగా, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం బృందం శుక్రవారం సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ భేటీలో కులగణన సర్వే అంశాలను వివరించనున్నారు.  

సభలపై చర్చించేందుకు వచ్చాం: భట్టి  

కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్‎కు అందజేశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘‘రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించాం. ఎస్సీ వర్గీకరణకు, కులగణన రిపోర్టుకు కేబినెట్‎లో ఆమోదం తెలిపాం. ఇవి రెండూ దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలు. ఇప్పుడు వీటిని సాకారం చేయడంతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దాని గురించి అధిష్టానంతో చర్చించడం కోసం ఢిల్లీకి వచ్చాం” అని చెప్పారు. 

త్వరలోనే రాష్ట్రానికి రాహుల్: పీసీసీ చీఫ్ 

కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో హైకమాండ్ పెద్దలను రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. కేసీ వేణుగోపాల్‎తో భేటీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. రెండు మూడ్రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని హైకమాండ్ ప్రకటిస్తుందని తెలిపారు. శుక్రవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలుస్తామన్నారు.