
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బుధవారం (మార్చి 12) ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలకమైన బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సిన కేసీఆర్ ముఖం చాటేశారు. బీఏసీ సమావేశానికి హాజరు కాకుండానే.. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
బీఏసీ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టడంతో బీఆర్ఎస్ పార్టీ తరుఫున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి బీఏసీ మీటింగ్‌కు హాజరయ్యారు. ముఖ్యమైన బీఏసీ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఇలా వచ్చి.. అలా తూతు మంత్రంగా వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కేసీఆర్ కేవలం మూడే సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు.
ALSO READ | గవర్నర్ ప్రసంగం మధ్యలో BRS సభ్యుల నినాదాలు.. ఎందుకంటే..?
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి.. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా మరోసారి హాజరైన కేసీఆర్.. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా సెషన్‌కు అటెండ్ అయ్యారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజే కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత సెషన్ మొత్తానికి దూరంగా ఉన్నారు. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి హాజరైన కేసీఆర్.. మిగిలిన సెషన్ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక.. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఏసీ మీటింగ్‌కు ప్రభుత్వం తరుఫున డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ మీటింగ్లో ఖరారు చేయనున్నారు. అలాగే.. ప్రభుత్వం ఈ సెషన్లో తీసుకురానున్న బిల్లుల గురించి వివరించన్నారు.