బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతం ఆ పార్టీని నేలకేసి గుద్దాలి : కేసీఆర్

బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతం ఆ పార్టీని  నేలకేసి గుద్దాలి  : కేసీఆర్

 

  • .. అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు
  • ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్‌ను గెలిపించిన్రు
  • బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతయ్​
  • కరెంట్​కు ఏం రోగమొచ్చింది.. మిషన్​ భగీరథ ఉండంగ నీళ్లెందుకిస్తలే?
  • దళిత బంధు కోసం అంబేద్కర్​ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడ్త
  • నోరుమూసుకోను.. పోరాటం చేస్త
  • చేవెళ్ల సభలో బీఆర్​ఎస్​ చీఫ్​ వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు బీజేపీ మతపిచ్చి లేపుతున్నదని, ఆ పార్టీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతామని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ అన్నారు. ‘‘మతం పిచ్చిలో పడి బీజేపీకి ఓటు వేస్తే పిచ్చిలేసి పోవుడు తప్ప, అవసరాలు తీరవు. పదేండ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పనికూడా జరగలేదు” అని వ్యాఖ్యానించారు. బీజేపీని నేలకేసి గుద్దితేనే మనకు రాజకీయ పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్నట్లు అని తెలిపారు. ‘‘కాంగ్రెస్ అడ్డగోలుగా ఇచ్చిన హామీలు, ప్రలోభాలకు లొంగి ఆ పార్టీని ప్రజలు గెలిపించిన్రు. ఐదు నెలలకే ఆ పార్టీ నీటి కష్టాలు, కరెంట్ కోతలు తెచ్చింది. వనరులు ఉన్నా వాడుకునే తెలివి కాంగ్రెస్‌‌‌‌కు లేదు” అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా హామీలన్నీ అమలయ్యేలా చూస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడడానికి బలమైన ప్రతిపక్షం ఉండాలని, బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులు అవుతాయని చెప్పారు. 

చేవెళ్లలో శనివారం ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన అంబేద్కర్​ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న పదేండ్లు ప్రజలను కండ్లలో పెట్టి చూసుకున్నామని, ఇప్పుడు ప్రజలు కష్టపడుతుంటే తనకు బాధ అయితున్నదని అన్నారు. ‘‘ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని, ఏమాత్రం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బ తగులుతుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనేకసార్లు నేను చెప్పిన. కానీ, ప్రజలలో కొంత మంది కాంగ్రెస్ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలకు లొంగి కింద మీద చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైతున్నా హామీల అమలు విషయంలో కార్యాచరణ కనపడ్తలేదు. వసతులు, వనరులు ఉన్నా వాటిని వాడుకునే నైపుణ్యం, తెలివి కాంగ్రెస్​ వాళ్లకు లేవు. మళ్లా ఆ పార్టీకి ఓటేస్తే ఎల్లెల్కల పండుకునుడు తప్ప హామీలు అమలు చేయదు” అని ఆయన దుయ్యబట్టారు. 

అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష పడ్త

తాను బతికున్నన్ని రోజులు ప్రజల కోసం పోరాడుతానని అన్నారు. ‘‘దళిత వాడలను ధనిక వాడలు చేయాలని దళితబంధు పెట్టినం. కేసీఆర్ పది లక్షలు ఇస్తే, రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ మాయ మాటలు చెప్పింది. ఇప్పుడు స్కీమ్‌‌‌‌ను ఆపేసింది. 1.30 లక్షల మందికి మేమే దళితబంధు ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చినం. కలెక్టర్ల అకౌంట్లలోకి డబ్బులు పంపినం. ఆ డబ్బులను కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం వాపస్ తీసుకుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. 1.30 లక్షల మంది దళిత బిడ్డలను నేనే సెక్రటేరియట్‌‌‌‌ పక్కనున్న అంబేద్కర్  విగ్రహం వద్దకు తీసుకొచ్చి దీక్ష పట్టి, మీ ( ప్రభుత్వం) మెడలు వంచి దళిత బంధు ఇప్పిస్తా” అని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌‌‌‌ రాగానే కరెంట్ ఎందుకు పోయిందో ప్రభుత్వం జవాబు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎలా నడిపిందో అలాగే నడిపిస్తే సరిపోతది. కానీ, అది కూడా చేయలేకపోతున్నరు. ఐరాస కూడా ప్రశంసించిన మిషన్ భగీరథ ఉండగా, మంచి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు. కరెంట్‌‌‌‌కు ఏం రోగమొచ్చింది? ప్రజల చేతిలో ఒక హంటర్ కావాలి. ప్రభుత్వ మెడలు వంచి పనులు చేయించే అంకుశం కావాలి. అలాంటి అంకుశమే కాసాని జ్ఞానేశ్వర్.. ఆయన ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయించాలంటే, అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థులు గెలవాలి.” అని ఆయన పేర్కొన్నారు. ‘‘అన్ని పంటలు బోనస్ ఇచ్చి కొంటాం అని కాంగ్రెస్ చెప్పింది. పంట బోనస్ ఇయ్యకపోతే, వడ్లు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్‌‌‌‌కు గుణపాఠం తప్పదు” అని పేర్కొన్నారు. 

రంజిత్​రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా?

చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌‌‌‌ రెడ్డి కాంగ్రెస్‌‌‌‌లో చేరడంపై కేసీఆర్ విమర్శించారు. ‘‘అధికారం ఎటుంటే అటు పోవడానికి ఆయనేమైనా పొద్దు తిరుగుడు పువ్వా? రంజిత్‌‌‌‌రెడ్డికి ఏం తక్కువ చేసినం? ఎంపీ టికెట్ ఇయ్యలేదా? గెలిపించుకోలేదా? ఎందుకు ఆయన పార్టీ మారిండు? కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లు ఇద్దరూ ఎవరికీ తెల్వదు. మనమే వాళ్లను గెలిపించినం. వాళ్లిద్దరినీ ఓడించాలి” అని అన్నారు. తాము చేవెళ్లలో అనేక ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు తెచ్చామని కేసీఆర్  చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో చేవెళ్లకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. ‘‘ఉద్దండపూర్ రిజర్వాయర్ కూడా చేవెళ్ల, రంగారెడ్డి కోసమే పెట్టుకున్నాం. దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏందో చెప్పాలి” అని ప్రశ్నించారు. 

చేవెళ్ల సీటును కేసీఆర్‌‌‌‌కు బహుమతిగా ఇస్తా: కాసాని జ్ఞానేశ్వర్

చేవెళ్ల లోక్​సభ స్థానంలో గెలిచి.. ఈ సీటును బీఆర్ఎస్ అధ్యక్షుడు​ కేసీఆర్‌‌‌‌కు బహుమతిగా ఇస్తానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. బలహీనవర్గాలకు చెందిన ప్రతి బిడ్డ తన గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు. శనివారం చేవెళ్లలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన విజయానికి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర నాయకులు చాలా కష్టపడుతున్నారని, వారి ఆశలను అడియాసలు చేయబోనని చెప్పారు. చేవెళ్ల అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తన ప్రసంగంలో చేవెళ్ల గడ్డమీద తాను గెలుస్తానని చెప్పబోయి.. కాంగ్రెస్ గెలుస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ నోరు జారారు.

అయితే మోదీ.. లేకుంటే ఈడీ.. ఇదేనా బీజేపీ?

దేశంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని కేసీఆర్​ విమర్శించారు.  ‘‘ఈరోజు దేశంలో ఏం జరుగుతున్నది.. మా పార్టీలో జాయిన్ అయితవా? జైలుకు పోతవా అంటున్నడు. అయితే మోదీ.. లేకుంటే ఈడీ.. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం. ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని పాతరేసే పద్ధతి? మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. గుడ్డిగా అలవోకగా ఓటు వేయొద్దు. చాలా ఇబ్బందులు అవుతయి. మోదీ నా మెడ మీద కత్తి పెట్టి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టక పోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేస్తాన ని బెదిరించిండు. ఏడాదికి రూ.5 వేల కోట్లు నిధులు ఆపేసిండు. అయినా నేను మీటర్లు పెట్టలేదు. బీజేపీకి ఓటు వేస్తే మీటర్లు పెడ్తరు” అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.