హైదరాబాద్కు జస్టిస్ పీసీ ఘోష్.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీశ్.!

హైదరాబాద్కు జస్టిస్ పీసీ ఘోష్..  కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీశ్.!

కాళేశ్వరం కమిషన్  విచారణలో స్పీడ్ పెంచింది.  ఈ  క్రమంలో ఇవాళ( నవంబర్ 21న)  కాళేశ్వరం విచారణ ఛైర్మన్ జస్టిస్  పీసీ ఘోష్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు.   నవంబర్ 23 నుంచి  మరోసారి కాళేశ్వరంపై విచారణను ప్రారంభించనుంది.   రెండు వారాల పాటు కమిషన్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అనంతరం కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. 

  ఇప్పటికే రిటైర్డ్ ఇంజినీర్లను విచారించిన కాళేశ్వరం కమిషన్.. విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ,కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐఏఎస్ ల విచారణ తర్వాత  ఈ సారి ప్రజాప్రతినిధులను, గత ప్రభుత్వ పెద్దలను విచారించే అవకాశం ఉంది.  అధికారుల విచారణ అనంతరం ప్రజాప్రతినిధులకు నోటీసులిచ్చి విచారించనుంది కమిషన్. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్,  గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్న హరీశ్ ను కూడా కమిషన్ విచారణ చేయనుందని తెలుస్తోంది.

కాళేశ్వరం కమిషన్ విచారణలో పలుమార్లు కేసీఆర్, హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. అఫిడవిట్ల సమర్పించిన అధికారులు, ఇంజినీర్లు, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పేర్లను ప్రస్తావించారు. అయితే హరీశ్ రావు ఆదేశాల మేరకే  చేశామంటూ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి కమిషన్ కు వివరించడంతో పాటు అఫిడవిట్  ను సైతం ఇచ్చారు. తన విచారణ సందర్భంగా సుధాకర్ రెడ్డి మూడు సార్లు హరీశ్ రావు పేరును ప్రస్తావించారు. దీంతో తనను కూడా విచారణకు పిలుస్తారని హరీశ్ రావు  ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.  ఈ క్రమంలోనే  గత మూడు రోజులుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు, గతంలో విచారణకు హాజరైన వారితో  హరీశ్ మంతనాలు జరిపారు. 


హరీశ్ విచారణ తర్వాతే తన ఎంక్వైరీ ఉంటుందని సన్నిహితులతో కేసీఆర్ చెబుతున్నట్టు సమాచారం. హరీశ్  రావు మంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం  ప్రాజెక్టుకు బీజం పడింది కాబట్టి.. ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. ఇందులో హరీశ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భావించిన కేసీఆర్  ఆయనను మంత్రిపదవి నుంచ తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని కూడా కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి వాటికి తానెలా  సమాధానం చెప్పాలనే అంశంపై  కేసీఆర్  పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం.