ఎన్నికల తేదీకి దాదాపు 4 నెలల ముందు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. 7 గురికి మాత్రమే టికెట్ తిరస్కరించారు. సిట్టింగ్ లు కనీసం 40 మంది ఎమ్మెల్యేలను తప్పిస్తారని భావించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా కేసీఆర్ సాహసమే చేశారు. ఆశ్చర్యకరంగా వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలను కూడా కేసీఆర్ మట్టికరిపించారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కేసీఆర్, వామపక్షాల మధ్య ప్రేమాయణం సాగుతోంది. అక్కడ ఆప్యాయత అనేది బహిరంగ ప్రదర్శన కూడా. కానీ కేసీఆర్ హఠాత్తుగా ఏమీ చెప్పకుండా ఉభయ వామపక్షాలను అవమానకరంగా నిరాశకు గురిచేశారు. కొన్నైనా స్థానాలు కేసీఆర్ ఇస్తారని లెఫ్ట్‌పార్టీలు ఆశించాయి. వారికి టిక్కెట్లు ఇస్తే అవి ఆ సీట్లు కోల్పోతాయి అనేది కూడా కేసీఆర్ సందేహం.
కేసీఆర్ ఓటర్లు వామపక్షాలకు ఓటేస్తారా? అలాగే వామపక్షాల ఓటర్లు బీఆర్ఎస్ కు ఓటేస్తారా? కేసీఆర్ తన ఓట్లను తానే వారికి బదిలీ చేయలేరు. వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇచ్చినా అవి శత్రువులకే పోతాయని కేసీఆర్ భయం.
పాత కాపుల ఎంపిక వ్యూహాత్మకమా?
కేసీఆర్ చాలా తక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు . కేసీఆర్ 30 మంది ఎమ్మెల్యేలను వదులుకొని ఉంటే.. తెలంగాణలో తిరుగుబాటు తాకిడిలు ప్రగతి భవన్‌ను చుట్టుముట్టేవి. హైదరాబాద్ వివిధ జిల్లాలకు సమీపంలో ఉన్నందున, భంగపడిన ఎమ్మెల్యే 2 గంటల్లో తన మద్దతుదారులను ప్రగతి భవన్‌కు రవాణా చేసేవాడు. హంగామాలు సృష్టించేవారు. ఒక రకమైన తిరుగుబాటు దృశ్యాలు కనిపించేవి. బీఆర్ఎస్ జాతీయ నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రతిష్ట గురించి దేశంలో చెడు ప్రచారం జరిగి ఉండేది.
భారతదేశం అంతటా అతని ప్రతిష్టను దెబ్బతీసుండేది. సహజంగానే, దుష్ప్రచారం వస్తుందని కేసీఆర్ అలాంటి దృశ్యాలను నివారించడానికే సిట్టింగులకు టికెట్లు ఇచ్చారు. అయినా టికెట్టు దొరకని కొద్ది మందినే ఇపుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. జనగామ ఎమ్మెల్యే వర్సెస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎపిసోడ్ బీఆర్ఎస్ ప్రతిష్టకు బాగానే భంగం కలిగించిందని చెప్పొచ్చు. చివరకు ఎమ్మెల్సీ మహెందర్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించాల్సి వచ్చింది.
వేములవాడ ఎమ్మెల్యే కూ ఓ క్యాబినెట్ హోదా కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మన్‌ను చేసి సంతృప్తి పరిచాడు. ఇలా ఈ మాత్రం టికెట్ దొరకని కొద్ది మందిని బుజ్జగించడానికే కేసీఆర్ కు తల ప్రాణం తోకకు వస్తున్నది. నిజంగానే ఓ 30 మంది సిట్టింగులకు కూడా టికెట్ ఇచ్చి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది? ఈ విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. కాబట్టే దాదాపు సిట్టింగులను ఎవరినీ నొప్పించకుండా ఎన్నికల వ్యవహారాన్ని నడుపుతూపోతున్నాడు.
ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకే
ఇకపోతే, కేసీఆర్ తన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంత తొందరగా ఎందుకు ప్రకటించారనే దానిపై కూడా ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నారు. ఆయన పార్టీకి పుష్కలంగా వనరులు ఉన్నాయి. 120 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ తట్టుకోగలడు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఇంతటి సుదీర్ఘ ప్రచారం, దాని ఖర్చులను తట్టుకోగలవా? ఎన్నికల ఖర్చు ఎలా ఉంటదో టికెట్ ఆశావహులకు బాగా తెలుసు. ఈ సుదీర్ఘ కాలపు ప్రచారం కేసీఆర్‌కే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అందుకే ఆయన మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను బెంబేలెత్తిస్తున్నారు. టికెట్లు ఇచ్చిన కొంతమంది ఎమ్మెల్యేల పాపులారిటీ బాగుందా లేదా అని తేల్చుకోవడానికి కేసీఆర్‌కి 120 రోజులు సమయం ఉంటుంది.
పాపులారిటీ దెబ్బతిన్నవాళ్లు ఉంటే వాళ్లను మార్చాలి. లేదంటే ప్రజాదరణ పొందలేరు. ప్రచారం జోరుగా జరుగుతున్నపుడు కూడా అలాంటి వారిని నిశబ్దంగా కొందరిని తొలగించవచ్చు. అభ్యర్థులను ప్రకటించలేని కాంగ్రెస్, బీజేపీలను కేసీఆర్ ఇపుడు తిట్టిపోస్తారు. ఆ పార్టీలకు అభ్యర్థులే లేరని ఎగతాళిచేస్తారు. ఆ విధంగా ప్రతిపక్షాలు కేసీఆర్ దాడికి గురవుతాయి. వాటి బలహీనతలనూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు.
ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని ప్రకటించే వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనాల (పథకాలు) ఎరలు రుచి చూపిస్తూ ఉంటుంది. ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దకు వెళ్లి పనులు చేయించుకోవచ్చు. ఈ విధంగా.. వచ్చే 3 నెలల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ ప్రయోజనమే. ప్రవర్తనా నియమావళి ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి ఉంటే ఈ ప్రయోజనం సాధ్యమయ్యేది కాదు.
ప్రతిపక్షాలకు అప్రమత్తత అవసరం
కేసీఆర్ దాదాపు 51 మంది వెలమలు, రెడ్డిలను రంగంలోకి దించారు. దీన్ని తటస్థీకరించి లబ్ది పొందే ప్రయత్నం ప్రతిపక్షాలు చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ లు పొత్తు కుదిరే పార్టీలు కావు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ రెండు పార్టీలు ఇంగితజ్ఞానం ఉపయోగించాలి. కాంగ్రెస్ భావిస్తున్నట్లు కేసీఆర్ అధికారం చేజారిపోతుందేమో చూడాలి. ఒకవేళ కేసీఆర్ గెలిస్తే, కాంగ్రెస్ దారిలో అతనొక ముల్లు లాగా మారుతాడు. అలాగే, తెలంగాణలో మైనారిటీలు కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లనున్నారా? అనేది మరింత కీలకం. 1967 నుంచి..
కాంగ్రెస్ పార్టీఒకసారి ప్రాంతీయ పార్టీకి అధికారాన్ని కోల్పోతే.. ఆ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాని చరిత్ర ఉంది.1967 నుంచి తమిళనాడులో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేకపోవడమే కాకుండా ఆ రాష్ట్రంపై ఆశలే వదులుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఓడించి మూడు సార్లు తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా ఉండడం అందుకు ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం ఇది మూడు పార్టీల తెలంగాణ.
చివరి మాట..
ఇది తెలంగాణాలో త్రికోణ పోటీ. మిగిలిన 4 రాష్ట్రాల్లో అది బీజేపీ-, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోరు. తెలంగాణలో మాత్రం అత్యంత ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం, రోమన్ చక్రవర్తులు స్టేడియంలలో పోరాటాలు నిర్వహించేవారు. ఆ పోరాటాల నియమం ఏమిటంటే.. ఒక ఫైటర్ మాత్రమే సజీవంగా బయటకు వస్తాడు. అదృష్టవశాత్తూ, భారతదేశంలో, ఎన్నికల యుద్దానికి డబ్బు, మద్యమే ఆయుధాలు తప్ప రక్తం కాదు. కేసీఆర్ కు ఇవి కేక్ వాక్ ఎన్నికలు మాత్రం కావు. ఈసారి ఆయనకు హోరాహోరి పోరు తప్పదు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రాబోయే 120 రోజుల్లో మద్యం విక్రయాలు విస్తరిస్తాయి. ఆదాయం విస్తారంగా పెరగనుంది. రోజులు గడిచేకొద్దీ తెలంగాణ మద్యంలో మునిగిపోతుంది. ధనవంతులు, అవినీతిపరులు తమ నియోజకవర్గాలో వందల కోట్లు ఖర్చు చేస్తారు. నా అంచనా ప్రకారం, రాబోయే 120 రోజుల్లో రూ.20,000 కోట్లు తెలంగాణలో ఎన్నికల వ్యయం నీళ్లలా ఖర్చుకానుంది.
అదే సమయంలో కేసీఆర్ ఏకంగా అనేక గుర్రాల పై స్వారీ చేయడం చూడాల్సిన విషయం. కేసీఆర్‌కి ఒక ప్రమాదం మాత్రం పొంచి ఉంది. పార్టీ అసమ్మతుల బెడద అనేక స్థానాల్లో ఓటములను కూడా కొనితేవచ్చు.
ప్రతిపక్షాలు ఏం చేయగలవు?
నాగుపాము విషానికి కూడా విరుగుడు ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా సరిగ్గా పనిచేయాలి. బీజేపీ, కాంగ్రెస్‌లు కేసీఆర్ ట్రాప్‌లో పడి అభ్యర్థులను ప్రకటించకూడదు. మంచి అభ్యర్థుల కోసం వేచి ఉండాలి. అలాగే బీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తులను ఆకర్షించగలగాలి. ఇది సులభంగా జరిగేపనే. కనీసం 1000 మంది రాజకీయ నాయకులు బీఆర్ఎస్లో కోపంగా, నిరాశతో ఉన్నారు. వారికి ఏ పదవీ దక్కలేదనే వారి ఆగ్రహమే ప్రతిపక్షాలకు ఆయుధం.
ఈ ఔత్సాహికులు గత 10 సంవత్సరాలుగా హోదాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తాము ఎప్పటికీ శాసనసభ్యులు కాలేమని వారికి తెలుసు. ప్రతిపక్షాలు ఆ అసంతృప్త బీఆర్ఎస్ క్యాడర్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేరువకావాలి. కేసీఆర్ క్యాడర్ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. వీరు ఎన్నికల్లో వారి పార్టీకి పూర్తిగా సహకరించరు.