హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కును, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేశారు. ఆత్రం సక్కు గతంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు బదులు , కోవా లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
అప్పుడే సక్కుకు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆయనకు టికెట్‌ను ప్రకటించారు. మల్కాజిగిరి టికెట్‌ను మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని భావించినా.. ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజునూ పోటీ చేయించాలని అనుకున్నా.. ఆయన కూడా నిరాకరించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేశారు. ఇంకా మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, భువనగిరి సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.