- 15 రోజుల్లో అన్నీ సెట్ చేస్తమని చెప్పి పత్తా లేరు
- ఉప ఎన్నిక ఫలితాలొచ్చి 18 రోజులైనా అమలుకాని కేసీఆర్ ప్రకటనలు
- చండూరు రెవెన్యూ డివిజన్ రాలే.. వంద పడకల ఆసుపత్రి కాలే..
- కేటీఆర్ సహా ఇతర మంత్రుల హామీలకూ అతీగతీ లేదు
- మంత్రుల టీమ్ పర్యటన ఉంటుందని చెప్పినా అదీ లేదు
- మంత్రులు ఇచ్చి వెళ్లిన నంబర్లకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదంటున్న పబ్లిక్
నల్గొండ, వెలుగు:
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ముందుకు కదలడం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించిన పదిహేను రోజుల్లోనే చండూరు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రితోపాటు, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడ్తామని ఆయన అక్టోబర్ 30న ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చి 25 రోజులైంది. బై పోల్ రిజల్ట్స్ వచ్చి 18 రోజులు దాటిపోయింది. అయినా ఏ ఒక్కటీ నెరవేరలేదు. చండూరు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై కనీసం జీవో కూడా రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డితోపాటు నల్గొండ ఎమ్మెల్యేలు సీఎంను ఈ నెల 8న ప్రగతి భవన్లో కలిసినప్పుడు మునుగోడులో ఇచ్చిన హామీల విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారని, త్వరలోనే మంత్రుల టీమ్ మునుగోడులో పర్యటిస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఈ భేటీ జరిగి రెండువారాలైనా మంత్రుల టీమ్ మునుగోడులో అడుగుపెట్టనేలేదు.
దత్తతపై మళ్లీ స్పందించని కేటీఆర్
కేసీఆర్‌తోపాటు మునుగోడు ఎన్నికల ఇన్చార్జులుగా నెలపాటు నియోజకవర్గంలో తిష్టవేసి ప్రచారం చేసిన మంత్రులు కూడా ఓటర్లకు చాలా హామీలు ఇచ్చారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా ప్రకటించారు. తర్వాత ఇప్పటిదాకా ఈ విషయమై ఎలాంటి మాట రాలేదు.ఇంకా చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురం ఇండ్రస్టియల్ పార్కులో ఇండ్లు కోల్పోయిన 450 మంది నిర్వాసితులకు తక్షణమే ఇండ్ల జాగాలు ఇప్పిస్తామని అదే రోజు కేటీఆర్ మాటిచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతో ఇండ్ల జాగాల కోసం దండు మల్కాపురం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి నియోజకవర్గానికి వస్తానని, అభివృద్ధిని సమీక్షిస్తానని నామినేషన్ రోజు కేటీఆర్ అన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల సమక్షంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.
మంత్రులు ఫోన్లు ఎత్తుతలే..
కేసీఆర్, కేటీఆర్ బాటలోనే ఇన్చార్జులుగా వ్యవహరించిన మంత్రులు కూడా మస్త్ హామీలిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటానన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇండ్లు లేని పేదలందరికీ ఉప ఎన్నిక అయిపోంగనే డబుల్ బెడ్రూం ఇండ్లు శాంక్షన్ చేయిస్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. కొత్తపేట కాలనీలోని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇప్పిస్తానంటూ అందరి నుంచి ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకెళ్లారు. ఎన్నికలు ముగిసిన 10రోజుల్లో దళితబంధు ఇస్తామని మంత్రి చెప్పారని, కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని నారాయణపురం దళితులు వాపోతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సర్వెల్లో, మంత్రి సత్యవతి రాథోడ్ రాచకొండ తండాలోనూ ఇలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు పైసలిప్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కొత్తపేట, లింగోజి గూడెంలలో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని, ఊరిలో ఎక్కడ స్థలం ఉన్న వారికి కేటాయించాలని మున్సిపల్ చైర్మన్‌కు చెప్పారు. ఇప్పుడు ఆ మున్సిపల్ చైర్మన్ కూడా కనిపించడం లేదని పబ్లిక్ అంటున్నారు. ఇక, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్- కోయిలగూడెం నుంచి అల్లాపురం దాకా రోడ్డు వేయిస్తానన్నారు. తాము ఎన్నికలయ్యాక కనిపించకుండా పోయేవాళ్లం కాదని, నిత్యం అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చంటూ పలువురు మంత్రులు గ్రామస్తులకు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్లారు. హామీల సంగతి ఏమైందో అడిగేందుకు తాము మంత్రులకు ఫోన్ చేస్తున్నా ఎవరూ ఎత్తడం లేదని మునుగోడు ప్రజలంటున్నారు. అటు కిష్టరాంపల్లికి చెందిన 1,100 భూనిర్వాసిత కుటుంబాలు కూడా ఇండ్ల జాగాలు ఇస్తామన్న మంత్రుల హామీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు.
మల్లారెడ్డి ఎప్పుడొస్తారో.. మిగిలిన పైసలు ఎప్పుడిస్తరో..
చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డిబాయి, కాట్రేవు ఎంపీటీసీ స్థానానికి ఇన్చార్జ్గా వ్యవహరించిన మంత్రి మల్లారెడ్డి.. గౌడ, యాదవ, వడ్డెర కుల సంఘాలకు కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చిన మంత్రి.. ఉప ఎన్నిక ముగియగానే మిగిలిన మొత్తం ఇచ్చి దగ్గరుండి కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తానని చెప్పారు. పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయిస్తానని, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తానని, ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు తన కాలేజీలో ఫ్రీ సీట్లు ఇప్పిస్తానని ఇలా.. మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన హామీల లిస్టు పెద్దగానే ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడంతో 3గ్రామాల ప్రజలు మంత్రి మల్లారెడ్డి కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ హాళ్లకు మిగిలిన పైసలు ఎప్పుడు వస్తాయోనని చర్చించుకుంటున్నారు.
మంత్రుల టీమ్ పర్యటనేమాయె?
టీఆర్ఎస్ గెలిచాక ఈనెల 8న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల సంగతిని స్వయంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారని, వాటి అమలుకు త్వరలోనే కార్యాచరణ ప్రారంభించాలని సూచించినట్లు మంత్రి చెప్పారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ట్రైబల్వెల్ఫేర్ తదితర శాఖలకు చెందిన మంత్రులంతా కలిసి ఒక టీమ్‌గా మునుగోడుకు వెళ్లి నివేదికలతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కూడా జగదీశ్‌రెడ్డి తెలిపారు. శివన్నగూడెం, చర్లగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతని సమీక్ష చేస్తామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న మునుగోడులో మంత్రుల పర్యటన ఉంటుందని అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇందులో భాగంగా 12న జిల్లా స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ మీటింగ్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి శాఖలవారీగా పెండింగ్ వర్క్స్ జా బితాను ప్రిపేర్ చేశారు. కానీ ఇప్పటి దాకా మంత్రుల టీమ్ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు.
కేటీఆర్ హామీ ఇచ్చినా యశోదకు ఉద్యోగం రాలే..
గత నెల 22న గట్టుప్పల్‌లో మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తుండగా.. గ్రామానికి చెందిన వడ్డేపల్లి యశోద అనే దివ్యాంగురాలు కలిసి, తనకు ఉపాధి చూపించాలని కోరారు. స్పందించిన కేటీఆర్..ఆమె ఇంటి నుంచే మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేశారు. ‘‘బావా ఓ రిక్వెస్ట్.. గట్టుప్పల్‌కు చెందిన దివ్యాంగురాలు యశోద నా దగ్గరికి వచ్చారు.. ఆమె బాగా చదువుకున్నారు.. గతంలో జీఎంఎంగా చేశారు.. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు.. చండూరు పీహెచ్సీలో ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉందట.. యశోద వివరాలు నీకు వాట్సాప్ చేస్తా. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చూడు” అని చెప్పారు. ఎన్నికలు ముగిశాక యశోద తండ్రి లక్ష్మయ్య పది రోజుల కింద గట్టుప్పల్ కు చెందిన ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని కేటీఆర్ ఆఫీసుకు వెళ్లారు. కానీ, ఆ సమయంలో కేటీఆర్ లేరని చెప్పడంతో నిరాశగా తిరిగివచ్చారు. అయితే.. కేటీఆర్ ఇచ్చిన మాటపైన తమకు నమ్మకం ఉం దని, త్వరలో తప్పక ఉద్యోగం వస్తదని యశోద ‘వెలుగు’తో అన్నారు.
గొర్రెల పైసలు ఇంకా ఫ్రీజింగ్..
ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది గొర్రెల స్కీమ్ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.93 కోట్లు జమ చేశారు. కానీ ఇప్పటి వరకు యూనిట్లు గ్రౌండింగ్ చేయలేదు. తమ అకౌంట్లలో పైసలు పడడంతో ఇక తామే స్వయంగా గొర్రెలు కొనుక్కోవచ్చని గొల్లకురుమలు భావించగా.. వారికి నిరాశే మిగిలింది. అకౌంట్లపై ఫ్రీజింగ్ పెట్టడంతో పాటు ఎప్పట్లాగే తామే గొర్రెల యూనిట్లను కొని స్తామని ఆఫీసర్లు చెప్తుండటంతో గొల్లకురుమలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
మీరు వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ అని చిన్నచిన్న కోర్కెలు కోరుతున్నరు.. సద్దికట్టి పంపండి.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి.. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా.. ప్రతి ఎకరాకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది.. ఎక్కడి వరకైనా కొట్లాడి, చర్లగూడెంతో పాటు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తా.. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్‌తో పాటు మీ కోర్కెలన్నీ నెరవేరుస్త.
- అక్టోబర్ 30న చండూరులోని బంగారిగడ్డ సభలో సీఎం కేసీఆర్
రోడ్లు, చెక్ డ్యాంలకే రూ.100 కోట్లు కావాలె..
సీఎం చెప్పినట్లు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు అద్దాల్లా మెరవాలన్నా, కల్వర్టులు, బ్రిడ్జిలు, చెక్ డ్యాంలు పూర్తికావాలన్నా సుమారు రూ.100 కోట్లు అవసరమని అధికారులు అంటున్నారు. మంత్రుల టీమ్ పర్యటన ఉంటుందనే ఉద్దేశంతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల వారీగా వారు ప్రపోజల్స్ రెడీ చేశారు. కానీ మంత్రులు రాకపోవడంతో అన్నీ పెండింగ్‌లో పడ్డాయి.