పవర్​ కమిషన్​ను రద్దు చేయండి..హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

పవర్​ కమిషన్​ను రద్దు చేయండి..హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
  • విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణాధికారం 
  • ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ, చట్టవిరుద్ధం
  • దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు
  • విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు
  • జస్టిస్ నర్సింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ
  • ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్, కమిషన్ చైర్మన్ జస్టిస్‌ నర్సింహా రెడ్డి 

హైదరాబాద్,  వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్​ను రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చత్తీస్ గఢ్​తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్​లో కేసీఆర్ పేర్కొన్నారు.

‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారించే పరిధి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్ఈఆర్సీ) కు మాత్రమే ఉంటుంది. ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తున్నది. ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. విద్యుత్ చట్టంలోని సెక్షన్‌ 61, 62, 86లకు విరుద్ధంగా జీవో 9ను విద్యుత్‌ శాఖ జారీ చేసింది. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్‌ఈఆర్సీ పరిధిలోనివే. కాబట్టి ప్రభుత్వం విడిగా కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు” అని కేసీఆర్​ అన్నారు. 

‘‘కమిషన్‌‌ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఈ మేరకు సమగ్ర వివరాలతో లేఖ రాసినా కమిషన్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ నర్సింహారెడ్డి స్పందించలేదు. ఆయన ఆ పదవిలో కొనసాగడం రాజ్యాంగ, చట్ట విరుద్ధం” అని కేసీఆర్​ అన్నారు. విచారణకు హాజరై ఆధారాలు సమర్పించాలంటూ కమిషన్‌‌ ఈ నెల 19న నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ‘‘ప్రజాప్రయోజనాలకు చెందిన అంశాలు ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్‌‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే ప్రస్తుత ప్రభుత్వం కమిషన్‌‌ను ఏర్పాటు చేసింది.

కమిషన్‌‌ను ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేనందున ఆ కమిషన్ ను రద్దు చేయాలి. జీవోను కొట్టివేయాలి. కమిషన్‌‌ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి’’ అని కోరారు. పిటిషన్ లో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ నర్సింహారెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ పిటిషన్‌‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. దీనికి ఇంకా నెంబర్ కేటాయించలేదు. 

అన్ని అనుమతులు తీసుకున్నం.. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత సరిపడా విద్యుత్ లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఆ సమస్యను అధిగమించడానికి విద్యుత్‌‌ కొనుగోలు, విద్యుత్‌‌ ప్లాంట్ల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పిటిషన్ లో కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుకు, పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎస్ఈఆర్సీ సహా అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ‘‘విద్యుత్తు చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్‌‌ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ. ఎస్‌‌ఈఆర్సీ తన ముందున్న అంశంపై ఉత్తర్వులు జారీ చేస్తే, దాన్ని విభేదించేవాళ్లు సవాల్‌‌ చేసేందుకు అప్పిలేట్‌‌ అథారిటీ కూడా ఉంది.

ఎస్‌‌ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులకు రక్షణ ఉంటుంది. వాటిని ప్రభుత్వం, అధికారులు, ట్రైబ్యునల్, కమిషన్, సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ టైమ్​లో చెప్పవచ్చు. ఎస్‌‌ఈఆర్సీ నిర్ణయంపై సంతృప్తి చెందనివాళ్లు అప్పిలేట్‌‌ ట్రైబ్యునల్‌‌ను, ఆ ట్రైబ్యునల్‌‌ ఇచ్చే ఉత్తర్వులను విభేదించేవాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది.

విద్యుత్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఈ విధానాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అన్నీ అంశాలనూ ఎస్‌‌ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేపట్టాలి. మరెక్కడా విచారణ చేపట్టడానికి వీల్లేదని గుజరాత్‌‌ ఊర్జా వికాస్‌‌ వర్సెస్‌‌ ఏఆర్‌‌ పవర్‌‌ లిమిటెడ్‌‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది” అని పేర్కొన్నారు. 

ఇది రాజకీయ చర్య.. 

కమిషన్ ఏర్పాటు రాజకీయ చర్యేనని కేసీఆర్ అన్నారు. ‘‘చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అప్పటి తెలంంగాణ టీడీపీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, ఎమ్మెల్యే రేవంత్‌‌రెడ్డితో పాటు మరికొంత మంది ఎస్‌‌ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. ఆ వాదనలు విన్న తర్వాత ఎస్‌‌ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు, టారిఫ్‌‌లకు సంబంధించి డిస్కమ్ లు అప్పిలేట్‌‌ ట్రైబ్యునల్‌‌ను ఆశ్రయించాయి.

రేవంత్‌‌ రెడ్డి మాత్రం అప్పీల్‌‌ చేయలేదు. డిస్కమ్​లు దాఖలు చేసిన అప్పీల్స్‌‌ పెండింగ్‌‌లో ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రేవంత్‌‌రెడ్డి.. ఈఆర్సీ నిర్ణయంపై అప్పీలేట్‌‌ ట్రైబ్యునల్‌‌కు వెళ్లలేదు. కానీ ఆయన సీఎం అయ్యాక తన అధికారాన్ని ఉపయోగించి విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్‌‌ను ఏర్పాటు చేయడం రాజకీయ చర్యే” అని పేర్కొన్నారు. 

జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సరిగా జరగట్లేదు..

ఎస్‌‌ఈఆర్సీ వంటి జ్యుడీషియల్ సంస్థ విచారించిన అంశంపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కమిషన్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ నర్సింహారెడ్డి.. ఆ పని చేయలేదని పిటిషన్ లో కేసీఆర్ పేర్కొన్నారు. అంతేగాకుండా విద్యుత్​ఒప్పందాలపై వివరణ ఇవ్వాలంటూ తనకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. ‘‘ఎన్నికల ప్రచారం తదితర కారణాల వల్ల వివరణ ఇచ్చేందుకు నేను గడువు తీసుకున్నాను. అయితే నేను నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్‌‌ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అందులో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే నాటికి పవర్‌‌ ప్లాంట్‌‌లు లేవని, భద్రాద్రి ప్లాంట్ లో సబ్‌‌ క్రిటికల్‌‌ టెక్నాలజీని వినియోగించడం ద్వారా దాదాపు రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. కానీ ఈ వివరాలు రికార్డులకు భిన్నంగా ఉన్నాయి. నోటీసులకు సమాధానం ఇవ్వకముందే నిర్ణయాలను ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.

దీన్ని బట్టి చూస్తే జస్టిస్‌‌ నర్సింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని తెలుస్తున్నది. ముందే తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడాన్ని చూస్తే విచారణ నామమాత్రమేనని, అందువల్ల కమిషన్‌‌కు వివరాలు సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమవుతున్నది” అని అన్నారు.